- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరాఖండ్ నేషనల్ పార్క్‌లో అద్భుతం.. అరుదైన కవల పిల్లలకు జన్మనిచ్చిన ఏనుగు
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఓ అద్భుతమైన, అరుదైన వన్యప్రాణి దృశ్యం వెలుగుచూసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఓ అద్భుతమైన, అరుదైన వన్యప్రాణి దృశ్యం వెలుగుచూసింది. పార్క్‌లోని గార్జియా టూరిజం జోన్‌లో ఒక ఆడ ఏనుగు రెండు ఆరోగ్యకరమైన కవల పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా ఏనుగులు కవలలకు జన్మనివ్వడం చాలా అరుదు కావడంతో.. ఈ ఘటన వన్యప్రాణి నిపుణులు, అటవీ శాఖ అధికారులు, పర్యావరణ ప్రేమికులలో తీవ్ర ఆనందాన్ని నింపింది.
వెలుగులోకి వచ్చిందిలా..
ప్రముఖ వన్యప్రాణి ప్రేమికుడు సంజయ్ చిమ్వాల్ గార్జియా జోన్‌లో జంగిల్ సఫారీ చేస్తున్న సమయంలో ఈ తల్లి ఏనుగు, దాని కవల పిల్లలను గుర్తించారు. ఆ దృశ్యాలను ఆయన వీడియో తీయగా, ఆ ఫుటేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అరుదైన జననం కార్బెట్ రిజర్వ్‌లోని పర్యావరణ వ్యవస్థ (ecosystem) ఎంత బలంగా, ఆరోగ్యంగా ఉందో తెలియజేస్తుందని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఏనుగులు కవలలకు జన్మనివ్వడం అనేది అత్యంత అరుదైన విషయం. ఏనుగుల గర్భధారణలలో కేవలం 0.5 నుంచి 1 శాతం (1% కంటే తక్కువ) మాత్రమే ఇలా కవలలు పుట్టే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్బెట్ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ డాక్టర్ సాకేత్ బదోలా మాట్లాడుతూ.. ‘కార్బెట్ ల్యాండ్‌స్కేప్‌లో 1,200కు పైగా ఏనుగులు ఉన్నాయి. ఏనుగుల గర్భధారణ కాలం సుమారు 22 నుంచి 24 నెలల వరకు ఉంటుంది. ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కవలలు పుట్టడం ఒక విశేషం. ఇది ఇక్కడి సురక్షితమైన, ఆరోగ్యకరమైన వన్యప్రాణి వాతావరణానికి సానుకూల సూచిక’ అని హర్షం వ్యక్తం చేశారు.
తల్లి ఏనుగుకు సవాలే.. అటవీ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ
వన్యప్రాణి నిపుణుడు, మాజీ అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగనాథ్ పాండే మాట్లాడుతూ.. ‘అడవిలో కవలలు బతకడం అనేది ప్రధాన సవాలు. దీర్ఘకాలిక గర్భధారణ, ఆపై రెండు పిల్లలకు ఏకకాలంలో పాలు ఇవ్వడం అనేది తల్లి ఏనుగుపై తీవ్రమైన పోషకాహార భారాన్ని (nutritional strain) మోపుతుంది. దీన్ని తట్టుకుని పిల్లలను సాకడం సవాలుతో కూడుకున్నది’ అని వివరించారు. కవల ఏనుగుల వార్త బయటకు రావడంతో గార్జియా జోన్‌లో పర్యాటకుల రద్దీ అమాంతం పెరిగింది. ఈ అరుదైన ఏనుగుల కుటుంబాన్ని చూసేందుకు సందర్శకులు సఫారీ బుకింగ్స్ కోసం ఎగబడుతున్నారు. అయితే, పర్యాటకుల తాకిడి వల్ల తల్లి ఏనుగుకు, దాని కవల పిల్లలకు ఎలాంటి ఇబ్బంది, అంతరాయం కలగకుండా అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణను ముమ్మరం చేశారు. వాటికి తగినంత స్వేచ్ఛా స్థలం ఉండేలా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, ఇంతకుముందు మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో కూడా ఇలాంటి కవల ఏనుగుల జననం నమోదైంది.






