- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయ పూజారిని గాలిలోకి విసిరేసిన ఏనుగు.. ఉత్సవాల్లో చెలరేగిన భయాందోళనలు
కేరళలలో జరిగిన ఊరేగింపులో ఒక ఏనుగు విగ్రహాన్ని పట్టుకున్న పూజారిపై దాడి చేసింది. తన తొండంతో పూజారిని గాలిలోకి విసిరేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళలోని ప్రసిద్ధ అన్నమనాడ మహాదేవ ఆలయ ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఊరేగింపులో ఒక ఏనుగు ఒక్కసారిగా ఆగ్రహంతో, విగ్రహాన్ని పట్టుకున్న పూజారిపై దాడి చేసింది. తన తొండంతో పూజారిని గాలిలోకి విసిరేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అన్నమనాడ మహాదేవ ఆలయ ఉత్సవాల్లో భాగంగా ఏనుగును అందంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. ఆచారాల ప్రకారం దేవుడి విగ్రహాన్ని ఏనుగుపై ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక పూజారిని ఏనుగు పైకి ఎక్కించేందుకు మావటి ప్రయత్నిస్తున్న సమయంలో, పక్కనే విగ్రహాన్ని పట్టుకుని నిలబడిన మరో పూజారిపై ఏనుగు ఒక్కసారిగా దాడికి దిగింది. ఏనుగు తన తొండంతో పూజారిని పైకి ఎత్తి నేలకేసి కొట్టింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. మావటి వెంటనే అప్రమత్తమై ఏనుగును అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. తీవ్రంగా గాయపడిన పూజారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఏనుగు దాడిలో ఏఎస్ఐ మృతి
మరోవైపు, ఫిబ్రవరి 22న అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ జిల్లాలో ఒక అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది. సన్ పురా పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) మార్టిన్ లెగో (40) లోహిత్ నదీ తీరానికి తన స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా ఎదురైన అడవి ఏనుగు మార్టిన్‌ను తొక్కేయడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయన స్నేహితులు సురక్షితంగా తప్పించుకోగలిగారు.






