Election Results: బెంగాల్‌లో బీజేపీ లీడ్.. తమిళనాడులో డీఎంకే జోరు!

by Kema Shiva Kumar |

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా, తమిళనాడులో డీఎంకే తన హవా కొనసాగిస్తోంది.

Election Results: బెంగాల్‌లో బీజేపీ లీడ్.. తమిళనాడులో డీఎంకే జోరు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ (Counting)లో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో అధికార పక్షం, మరికొన్ని చోట్ల ప్రతిపక్షాలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

పశ్చిమ బెంగాల్: నువ్వా-నేనా!

అందరి దృష్టి ఆకర్షిస్తున్న బెంగాల్‌లో టీఎంసీ (TMC), బీజేపీ (BJP)ల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తొలి అంచనాల ప్రకారం.. బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార టీఎంసీ 40 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక్కడ ప్రతి రౌండ్‌కు సమీకరణాలు మారుతుండటంతో గెలుపెవరిదనేది ఉత్కంఠగా మారింది.

తమిళనాడు: డీఎంకే హవా.. లీడ్‌లోకి టీవీకే

తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) 17 స్థానాల్లో ముందంజలో ఉంది. ఏఐడీఎంకే (AIDMK) 7 స్థానాలకే పరిమితం కాగా, నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ ఒక స్థానంలో ఆధిక్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

కేరళం: ఎల్‌డీఎఫ్ vs యూడీఎఫ్

కేరళలో ఎప్పటిలాగే లెఫ్ట్, కాంగ్రెస్ కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) 17 స్థానాల్లో, అధికార ఎల్‌డీఎఫ్ (LDF) 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

అస్సాం & పుదుచ్చేరి: ఎన్డీఏ ముందంజ

అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ (BJP) కూటమి 14 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, కాంగ్రెస్ (Congress) కూటమి 7 స్థానాల్లో ఉంది. ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ కూటమి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఈవీఎంల లెక్కింపు వేగవంతం కావడంతో, మరో గంటలో పూర్తి స్థాయి అధికారిక ట్రెండ్స్ వెలువడనున్నాయి.

Next Story