తొలి నాలుగు విడతల్లో 66.95 శాతం పోలింగ్ : ఈసీ

by Hajipasha |
తొలి నాలుగు విడతల్లో 66.95 శాతం పోలింగ్ : ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌‌సభ తొలి నాలుగు దశల ఎన్నికల్లో 66.95 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నాలుగు దశల్లో ఎన్నికలు జరిగిన లోక్‌సభ స్థానాల పరిధిలో 97 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 45.10 కోట్ల మంది ఓటు వేశారు. ఈవివరాలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం వెల్లడించింది. వచ్చే మూడు విడతల్లో పెద్దసంఖ్యలో ఓట్లు వేయాలని ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. అత్యధిక పోలింగ్ అనేది భారత ప్రజాస్వామ్యపు బలం గురించి ప్రపంచానికి మన ఓటరు ఇచ్చిన సందేశమని ఆయన పేర్కొన్నారు. ‘‘ఓటింగ్ రోజు అంటే సెలవు దినం కాదు. ఓటు వేసి ఓటర్లు గర్వించాల్సిన రోజు’’ అని తెలిపారు.

ఏ విడతలో ఎంత పోలింగ్ ?

లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ ఏప్రిల్ 19న జరిగింది. ఇందులో 66.14 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019లో లోక్‌సభ ఎన్నికల తొలి దశలో 69.43 శాతం ఓటింగ్ జరిగింది. లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 26న జరిగింది. దీనిలో 66.71 శాతం మంది ఓటు వేశారు. 2019లో లోక్‌సభ ఎన్నికల రెండో దశలో 69.64శాతం పోలింగ్ నమోదైంది.లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ మే 7న జరిగింది. ఇందులో 65.68 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. 2019లో లోక్‌‌సభ ఎన్నికల మూడో దశలో 68.4 శాతం పోలింగ్ నమోదైంది. లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ మే 13న జరిగింది. ఇందులో 69.16 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. 2019లో లోక్‌సభ ఎన్నికల మూడోదశలో ఇంతకంటే 3.65 శాతం ఎక్కువే ఓటింగ్ నమోదైంది. కాగా, ఇప్పటివరకు నాలుగు దశల్లో 379 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 20న ఐదో దశ, మే 25న ఆరోదశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed