- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల ముందే నిప్పంటించుకున్న వృద్ధుడు.. రెచ్చిపోయిన గ్రామస్తులు.. పారిపోయిన పోలీసులు!
కోర్టు ఆదేశాలతో భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారుల ముందే ఓ వృద్ధుడు తనపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్‌లోని మధుబని జిల్లాలో ఓ భూవివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కోర్టు ఆదేశాలతో భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారుల ముందే ఓ వృద్ధుడు తనపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అధికారులపై మూకుమ్మడిగా దాడికి దిగారు. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. బేనిపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని అధ్వారి గ్రామంలో రాజేంద్ర ఠాకూర్, మహేంద్ర యాదవ్‌ల మధ్య దీర్ఘకాలంగా భూవివాదం నడుస్తోంది. ఇటీవల కోర్టు మహేంద్ర యాదవ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ అధికారుల బృందం భూమిని అప్పగించేందుకు గ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలో రాజేంద్ర ఠాకూర్ అనే వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వృద్ధుడు మంటల్లో కాలిపోతుండటం చూసి రగిలిపోయిన గ్రామస్తులు అధికారులపై దాడికి దిగారు. పరిస్థితి చేయి దాటడంతో సీఓ (సర్కిల్ ఆఫీసర్) అభిషేక్ ఆనంద్, అదనపు ఎస్‌హెచ్‌ఓ సంజయ్ కుమార్ సింగ్ అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. అయితే, అధికారులతో పాటే వచ్చిన కోర్టు కమిషనర్ రత్నాకర్ ఝా మాత్రం పట్టుబడటంతో, స్థానికులు ఆయనను నిర్బంధించి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం.
ప్రత్యర్థులే తగలబెట్టారు
ఈ భూమిపై గతంలో రెండు సార్లు తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందని రాజేంద్ర ఠాకూర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ సారి ప్రత్యర్థి వర్గం డబ్బులు వెదజల్లి అధికారులు, పోలీసులను కొనుగోలు చేశారని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, తన తండ్రి ఆత్మహత్య చేసుకోలేదని, మందులు వేసుకునేందుకు ఇంట్లోకి వెళ్లిన సమయంలో ప్రత్యర్థులే ఆయనకు నిప్పంటించారని వృద్ధుడి కుమారుడు బలరామ్ ఠాకూర్ తీవ్ర ఆరోపణలు చేశాడు. కాగా, తీవ్ర గాయాలపాలైన రాజేంద్ర ఠాకూర్ పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆయనను డీఎంసీహెచ్ (దర్భంగా) ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ అమిత్ కుమార్, ఎస్‌డీఓ ఇతర ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించారు. అధికారులపై దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.






