- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ED: ఈడీ చట్టం పరిధిలోనే పని చేయాలి.. దర్యాప్తు సంస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ మోసగాడిలా వ్యవహరించొద్దని, చట్టం పరిధిలోనే ఉండాలని సూచించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ మోసగాడిలా వ్యవహరించొద్దని, చట్టం పరిధిలోనే పని చేయాలని సూచించింది. ఈడీ నమోదు చేసిన పీఎంఎల్ఏ కేసుల్లో తక్కువ శిక్షార్హత రేటు ఉండటంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ అరెస్టు అధికారాలను సమర్థించిన 2022 తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ప్రజల స్వేచ్ఛ గురించి మాత్రమే గాక ఈడీ ఇమేజ్ పై సైతం ఆందోళన చెందుతున్నామని వ్యాఖ్యానించింది. ‘గత ఐదేళ్లలో ఈడీ నమోదు చేసిన 5000 కేసుల్లో 10 శాతం కంటే తక్కువ కేసులకే శిక్ష పడింది. ఈడీ మోసగాడిలా వ్యవహరించొద్దు. సాక్షులను మెరుగుపర్చుకోవాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం’ అని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. 5-6 సంవత్సరాల జ్యుడీషియల్ కస్టడీ తర్వాత ప్రజలు నిర్దోషులుగా విడుదలైతే, దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారని ప్రశ్నించారు. టాడా, పోటా కోర్టుల మాదిరిగానే ప్రత్యేక కోర్టులు ఉండటమే అన్ని సమస్యలకు పరిష్కారమని, ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించగలవని దీంతో కేసులను త్వరగా పరిష్కరించొచ్చని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు.
కేంద్రం, ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు. సమీక్ష పిటిషన్లు విచారణకు అనుకూలంగా లేవని తెలిపారు. ప్రభావవంతమైన దుండగులు చట్టపరమైన ప్రక్రియను ఉపయోగించుకుని బహుళ దరఖాస్తులు దాఖలు చేయడం ద్వారా దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. దీని వల్ల ఈడీ అధికారులు దర్యాప్తు నిర్వహించడం కంటే కోర్టుకు హాజరు కావడంపై దృష్టి పెట్టాల్సి వస్తుందని వెల్లడించారు. అయితే రాజు వాదనలను ధర్మాసనం తిరస్కరించింది.






