బిహార్‌ ఎస్ఐఆర్‌పై విమర్శలపై ఈసీ ఆగ్రహం.. ఇదే ఫైనల్ కాదు!

by Phanindra |

బిహార్‌ ఎస్ఐఆర్‌పై విమర్శలు చేయడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము విడుదల చేసిన డ్రాఫ్ట్ లిస్టు ఫైనల్ కాదని స్పష్టం చేసింది.

బిహార్‌ ఎస్ఐఆర్‌పై విమర్శలపై ఈసీ ఆగ్రహం.. ఇదే ఫైనల్ కాదు!
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో ఓటర్ లిస్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై విమర్శలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం మండిపడింది. ఇటీవల విడుదల చేసిన ఓటర్ లిస్టు కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని, ఇదే విషయాన్ని తాము ప్రకటించామని ఈసీ చెప్పింది. అయితే ఇదే ఫైనల్ లిస్ట్ అనే అపోహలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఈసీ ఆరోపించింది.

‘ఈ ఓటర్ల లిస్టులో పేర్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 1 వరకు సమయం ఉంది. ఈ విషయంపై ఇప్పుడు ఎందుకింత గొడవ చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా పార్టీలకు కలిపి మొత్తం 1.6 లక్షల మంది బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) ఉన్నారని, ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 1 వరకు అభ్యంతరాలు తెలపాలని వారికి ఎందుకు చెప్పడం లేదని సదరు పార్టీలను ఈసీ ప్రశ్నించింది.

కాగా, బిహార్‌లో మొత్తం 91.69 శాతం మంది అంటే 7.24 కోట్ల మంది ప్రజలు ధ్రువపత్రాలు సమర్పించారని ఈసీ తాజాగా పేర్కొంది. జూన్ నెలలో ఈ రాష్ట్రంలో ఓవరాల్‌గా 7.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7.24 కోట్ల మంది మాత్రమే పత్రాలు సమర్పించారంటే.. 65 లక్షల మంది ఓట్లు కోల్పోయినట్లే.

అయితే వీరిలో సుమారు 22 లక్షల మంది మరణించిన వారని, 36 లక్షల మంది కనిపించలేదని, వీరు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయి ఉండొచ్చని ఈసీ అభిప్రాయపడింది. అలాగే 7 లక్షల మంది ఒకటి కన్నా ఎక్కువ చోట్ల రిజిస్టర్ అయి ఉన్నారని ఈసీ తెలిపింది. ఆగస్టు 1న విడుదల చేసే డ్రాఫ్ట్ ఓటర్ బిల్లులో ఈ ఓటర్ల వివరాలన్నీ వెల్లడిస్తామని చెప్పింది.

Next Story