Earthquake: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రతగా నమోదు

by B.Srinivas |

దక్షిణ అమెరికా దేశమైన పెరూలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది.

Earthquake: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రతగా నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ అమెరికా దేశమైన పెరూ (Peru)లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. రాజధాని లిమా (Lima) సమీపంలో ఉన్న ఓడరేవు నగరం కల్లావో నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తారు. భూకంపం ధాటికి అనేక భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ భూకంపం కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 36 మంది గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. లిమాలో ఒక వ్యక్తి తాను నడుపుతున్న కారుపై గోడ కూలడంతో మరణించాడని వెల్లడించారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని పేర్కొన్నారు. పలు చోట్ల కొండచరియలు సైతం విరిగిపడ్డట్టు తెలుస్తోంది.

భూకంప పరిస్థితిపై పెరూ అధ్యక్షురాలు దినా బోలువార్టే స్పందించారు. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. సహయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. లిమాలో జరుగుతున్న పలు కార్యక్రమాలను రద్దు చేశారు. కాగా, పెరూ పసిఫిక్ మహాసముద్రం ఒడ్డున్న ఉన్న దేశం. ఇక్కడ తరచూ అగ్నిపర్వత కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టి భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. ప్రతిఏటా 100 భూపంపాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పెరూలో అతిపెద్ద భూకంపం 2021లో వచ్చింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతగా నమోదైంది. అంతకుముందు1970లో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 67,000 మంది మరణించారు.

Next Story