- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Earthquake: ఇస్తాంబుల్లో భూకంపం.. 6.2 తీవ్రతగా నమోదు
తుర్కియేలోని అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరమైన ఇస్తాంబుల్లో బుధవారం భారీ భూకంపం సంభవించింది.

దిశ, నేషనల్ బ్యూరో: తుర్కియే (Turkey) లోని అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరమైన ఇస్తాంబుల్ (Isthambul)లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. భూకంప కేంద్రం ఇస్తాంబుల్ సమీపంలోని మర్మార సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (Us Geological survey) తెలిపింది. భారీ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని తుర్కియే అత్యవసర విభాగం తెలిపింది. అయితే పలు భవనాలు దెబ్బతినగా ప్రజలను ఆ భవనాల నుంచి ఖాళీ చేయిస్తున్నట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి.
‘భూకంపం తర్వాత దెబ్బతిన్న భవనాల్లో ప్రజలు నివసించొద్దు. ప్రమాదకరమైన భవనాల దగ్గర ఉండొద్దు. ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ ఆధారిత మెసేజింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కమ్యూనికేట్ చేయండి. అధికారుల సలహాను పాటించండి’ అని తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ భూకంప ప్రభావంతో పొరుగు దేశాలైన బల్గేరియా, గ్రీస్ రొమేనియాలోనూ భూమి కంపించినట్టు తెలుస్తోంది. పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నామని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా, 2023 ఫిబ్రవరి 6న కూడా తుర్కియేలో 7.8 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. దీని కారణంగా ఆగ్నేయ టర్కీలోని 11 ప్రావిన్సులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ రెండు భూకంపాల వల్ల లక్షలాది భవనాలు ధ్వంసం కావడంతో పాటు 53 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.






