లోక్సభలో ఈ-సిగరెట్ దుమారం.. అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-11 07:30:40  IST  )

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ-సిగరెట్ వివాదం దుమారం రేపుతోంది.

లోక్సభలో ఈ-సిగరెట్ దుమారం.. అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ-సిగరెట్ వివాదం దుమారం రేపుతోంది. ఇవాళ లోక్‌సభలో క్వశ్చన్ అవర్‌లో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) మహిళా సభ్యులు లోక్‌సభలోనే ఈ-సిగరెట్లు (E-Cigarettes) తాగుతుంటే తాను చూశానని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్లు నిషేధించినా.. పవిత్రమైన చట్టసభలో ఇలాంటి పనులు ఏంటని ప్రశ్నించారు. అనంతరం ఆయన సభలోకి ఈ-సిగరెట్లను అనుమతించారా అని అని స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla)ను ప్రశ్నించారు. లోక్‌సభ ప్రాంగణంలో, సభలో కొంతమంది టీఎంసీ మహిళా సభ్యులు కొన్ని రోజులుగా నిరంతరం కూర్చొని ఈ-సిగరెట్లు తాగుతున్నారని ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికీ సభా నియమాల ఉల్లంఘనే అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

ఈ క్రమంలోనే స్పందించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. సభలోకి ఈ-సిగరెట్లకు తాను అనుమతిని ఇవ్వలేదన్నారు. సభలో ధూమపానం నేరమని అన్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు వస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనురాగ్ ఠాకూర్‌కు స్పీకర్ బదులిచ్చారు. అనంతరం ఆయన లోక్సభ సభ్యులను ఉద్దేశించి రూల్ పాస్ చేశారు. సభలో ఎవరైనా సిగరెట్ తాగుతున్నట్లుగా తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కాగా, 2019లోనే కేంద్ర ప్రభుత్వం ‘ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్’ ద్వారా ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, అమ్మకం, పంపిణీ పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే.

Next Story