Dwarka: ద్వారకాలో పరిశోధనలు.. ప్రారంభించిన ఆర్కియలాజికల్ సర్వే టీమ్

by B.Srinivas |   (  Updated:2025-02-20 14:47:59  IST  )

కృష్ణ కర్మ భూమిగా భావించే గుజరాత్‌లోని ద్వారక తీరంలో ఏఎస్ఐకి చెందిన ఐదుగురు సభ్యుల బృందం నీటి అడుగున అన్వేషణను నిర్వహించింది.

Dwarka: ద్వారకాలో పరిశోధనలు.. ప్రారంభించిన ఆర్కియలాజికల్ సర్వే టీమ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కృష్ణ కర్మ భూమిగా భావించే గుజరాత్‌లోని ద్వారక (Dwarka) తీరంలో ఆర్కియలాజికల్ సర్వే ఆప్ ఇండియా (Asi)కి చెందిన ఐదుగురు సభ్యుల బృందం నీటి అడుగున అన్వేషణను నిర్వహించింది. గుజరాత్ తీరంలో సముద్రంలోకి దిగి 4,000 ఏళ్ల పురాతన నగర రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఈ పరిశోధన ప్రారంభించినట్టు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్, ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి (Alok thripati) నేతృత్వంలోని ఐదుగురు పురావస్తు శాస్త్రవేత్తల బృందం దీనిని షురూ చేసినట్టు వెల్లడించింది. నీటి అడుగున ఉన్న భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడానికి ఏఎస్ఐ చేస్తున్న ప్రయత్నాలలో ఈ ఆవిష్కరణ ఒక ముఖ్యమైన భాగమని పేర్కొంది.

ద్వారక, ఓఖా తీరంలో ఉన్న బెట్ ద్వారక అనే ద్వీపం సమీపంలో చివరిసారిగా 2005, 2007లో పరిశోధన జరిగింది. అప్పటి నుండి ఏఎస్ఐ ఈ పనిని నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ద్వారకలో సముద్రం కింద ఉన్న చరిత్ర కోసం అన్వేషణ తిరిగి ప్రారంభమైందని తెలిపింది. కాగా, హిందూ పురాణాల ప్రకారం.. పురాతన ద్వారక నగరం అరేబియా సముద్రంలో మునిపోయినట్టుగా భావిస్తారు. దీనిని కృష్ణుడి కర్మభూమి లేదా ల్యాండ్ ఆఫ్ యాక్షన్ గా పరిగణిస్తారు. సముద్రం ముందుకు సాగడంతో సహజ కారణాల వల్ల గతంలోని ద్వారక అదృశ్యమైందని చరిత్ర కారులు చెబుతారు. ఈ నేపథ్యంలోనే దాని అవశేషాలను కనుగొనేందుకు పరిశోధనలు జరుపుతున్నారు.

Next Story