Drugs: గుజరాత్‌లో రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. అధికారులను చూసి సముద్రంలో పడేసిన స్మగ్లర్లు

by vinod kumar |
Drugs: గుజరాత్‌లో రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. అధికారులను చూసి సముద్రంలో పడేసిన స్మగ్లర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు చేసిన ప్రయత్నాలను తీర గస్తీ అధికారులు భగ్నం చేశారు. ఈ క్రమంలోనే రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల మెథాఫెంటమైన్ డ్రగ్స్‌ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS), ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్‌పై పక్కా సమాచారం మేరకు ఏటీఎస్, ఐసీజీ అధికారులు ఏప్రిల్ 12,13 రాత్రి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ సరిహద్దు సముద్ర రేఖ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఓడను గుర్తించారు. పడవను ఆపాలని అధికారులు వార్నింగ్ ఇవ్వడంతో వారి వద్ద ఉన్న మాదక ద్రవ్యాలను స్మగ్లర్లు సముద్రంలోకి విసిరేసి పారిపోయారు.

అనంతరం కోస్ట్ గార్డ్ బృందం రెస్క్యూ బోట్ సహాయంతో వాటిని బయటకు తీసి సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను విచారణ నిమిత్తం ఏటీఎస్‌కు అప్పగించారు. అయితే డ్రగ్స్ సరఫరా చేస్తున్న బోటుకు పాకిస్థాన్‌తో సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు. పాక్ నుంచే తీసుకొస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ చర్యపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) స్పందించారు. భారీగా డ్రగ్స్ పట్టుకున్న ఏటీఎస్, ఐసీజీలకు అభినందనలు తెలిపారు. సముద్రంలో జరిగిన ఈ ఆపరేషన్ మాదకద్రవ్యాలను నిర్మూలించడానికి మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్తుందని నొక్కి చెప్పారు.



Next Story

Most Viewed