Drinking Water: దేశంలో ‘LPG’ కొరత ఎఫెక్ట్: చుక్క నీరు.. చుక్కల్లో ధరలు

by Kema Shiva Kumar |

దేశంలో ఎల్‌పీజీ కొరత, ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.

Drinking Water: దేశంలో ‘LPG’ కొరత ఎఫెక్ట్: చుక్క నీరు.. చుక్కల్లో ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఎల్‌పీజీ సంక్షోభం, మరోవైపు వేసవి కాలం ముంచుకొస్తున్న వేళ సామాన్యులపై మరో భారం పడింది. తమిళనాడులోని తిరుచ్చితో పాటు పలు ప్రాంతాల్లో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ధరలు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పదార్థాల ధరల పెరుగుదల, వాణిజ్య ఎల్‌పీజీ (Commercial LPG) సరఫరాలో ఏర్పడిన అంతరాయం దీనికి ప్రధాన కారణాలని తయారీదారులు పేర్కొంటున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధం పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నీటిని శుద్ధి చేసే ప్లాంట్లలో, ప్యాకేజింగ్ ప్రక్రియలో ఈ గ్యాస్ వినియోగం తప్పనిసరి. సరఫరా తగ్గడంతో ఓపెన్ మార్కెట్‌లో గ్యాస్ ధరలు పెరిగి ఉత్పత్తి వ్యయం భారమైంది.

ముడి పదార్థాల ధరలకు రెక్కలు..

ఇక వాటర్ బాటిళ్ల తయారీకి వాడే ప్లాస్టిక్ (PET Resin), క్యాప్స్, లేబుల్స్ తయారీ ఖర్చులు 15 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగాయి. పెట్రోలియం అనుబంధ ఉత్పత్తుల ధరలు పెరగడం కూడా ఈ రంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇంధన ధరల పెరుగుదల, ముడి పదార్థాల సరఫరా గొలుసు దెబ్బతినడంతో రవాణా చార్జీలు కూడా భారమయ్యాయి.

మార్కెట్‌లో ప్రస్తుత పరిస్థితి ఇలా..

గతంలో రిటైల్ మార్కెట్‌లో 12 బాటిళ్లు ఉండే ఒక కార్టన్ ధర సుమారు రూ.127 ఉండగా, అది ఇప్పుడు ఏకంగా రూ.135కి చేరింది. అదేవిధంగా ఇది వరకు రూ.25 నుంచి రూ.30 మధ్య లభించే 20 లీటర్ల వాటర్ క్యాన్ ధర ఇప్పుడు ఒక్కసారిగా రూ.40 నుంచి రూ.50కి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో రిటైల్ వ్యాపారులు రవాణా చార్జీల పేరుతో దీనికంటే ఎక్కువే వసూలు చేస్తున్నారు. తక్కువ నిల్వ సామర్థ్యం ఉన్న చిన్న, మధ్యతరహా వాటర్ ప్లాంట్లు సరఫరా అంతరాయం వల్ల మూతపడే పరిస్థితి వచ్చాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరిగి నీటి డిమాండ్ అధికమవనున్న తరుణంలో గ్యాస్ సరఫరా మెరుగుపడకపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తయారీదారులు పేర్కొంటున్నారు.

వినియోగదారుల ఆందోళన..

తమిళనాడుతో పాటు వివిధ రాష్టాల్లో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఈ 20 లీటర్ల క్యాన్లపైనే ఆధారపడతాయి. హోటళ్లు, ఆఫీసులు, చిన్న వ్యాపార సంస్థలపై కూడా ఈ ప్రభావం పడనుంది. ఆయా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని నీటి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story