ఆపరేషన్ సిందూర్‌లో ప్రధాన ఆయుధం ‘బ్రహ్మోస్’

by Phanindra |

ఆపరేషన్ సిందూర్‌లో ప్రధాన ఆయుధం ‘బ్రహ్మోస్’ అని డీఆర్‌డీవో చీఫ్ సమీర్ కామత్ చెప్పారు. సుఖోయ్ నుంచి లాంచ్ చేసి పాక్‌పై దాడులు చేశామన్నారు.

ఆపరేషన్ సిందూర్‌లో ప్రధాన ఆయుధం ‘బ్రహ్మోస్’
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను, ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేయడం భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత సామర్థ్యాలకు నిదర్శనమని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) చైర్మన్ సమీర్ కామత్ తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సైనికులతోపాటు టెక్నాలజీ కూడా వెన్నెముకలా పనిచేసిందని కామత్ అన్నారు. పూణేలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (డీఐఏటీ) 4వ కన్వకేషన్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక మిలిటరీ మిషన్ మాత్రమే కాదు. స్వదేశీ సాంకేతికతతోనే భారత్ తన సరిహద్దులను కాపాడుకోగలదనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది’ అని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారత్ ఉపయోగించిన ప్రధాన ఆయుధం బ్రహ్మోస్ మిసైల్ అని, దీనిలో కూడా సుఖోయ్ నుంచి ఉపయోగించిన ఎయిర్ లాంచ్ వేరియంట్‌ను ప్రధానంగా ఉపయోగించామని చెప్పారు. ‘డిఫెన్సివ్ ఆయుధ వ్యవస్థలో ఆకాష్ సిస్టం, యాంటీ డ్రోన్ వ్యవస్థ అయిన డీ4 సిస్టం, ఎంఆర్-ఎస్ఏఎం ఉపయోగించాం’ అని కామత్ తెలిపారు.

ఆపరేషన్ సమయంలో అన్ని సెన్సార్లు కూడా ఆకాష్‌తీర్ ఉపయోగించామని, ఇది వచ్చే ప్రమాదాలను గుర్తించి, వాటిని నిరోధించడానికి ఎలాంటి ఆయుధాలు ఉపయోగించాలో కూడా ఇది చెప్తుందని వివరించారు. ఆకాష్‌తీర్ అనేది ఏఐతో పనిచేసే కీలకమైన వ్యవస్థ అని తెలిపారు.

Next Story