Air India crash: ఎయిరిండియా ప్రమాదంలో పైలట్లపై అనుమానాలు.. ఇంధన స్విచ్ ల ఆన్, ఆఫ్ వెనక బిగ్ ట్విస్ట్?

by Prasad Jukanti |   (  Updated:2025-07-12 10:57:53  IST  )

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

Air India crash: ఎయిరిండియా ప్రమాదంలో పైలట్లపై అనుమానాలు.. ఇంధన స్విచ్ ల ఆన్, ఆఫ్ వెనక బిగ్ ట్విస్ట్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశ పౌర విమానయాన రంగంలో తీవ్ర విషాదం నింపిన అహ్మాదాబాద్ ఎయిరిండియా ప్రమాద (Air India crash) ఘటనపై ప్రాథమిక నివేదిక చర్చనీయాశంగా మారింది. జూన్ 12న జరిగిన ఈ ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబి) (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోల్ స్విచ్ లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 15 పేజీలతో కూడిన ఈ ప్రాథమిక నివేదికలో ఈ స్విచ్ లు ఆగిపోయిన సమయంలో కాక్ పిట్ వాయిస్ రికార్డర్లో నమోదు అయిన పైలట్ ల సంభాషణ హాట్ టాపిక్ గా మారింది. ఇంధన స్విచ్ లు ఆగిపోగానే.. స్విచ్ లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరొ పైలట్ ను ప్రశ్నించారని అందుకు తాను ఆ స్విచ్ లను ఆపలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు కాక్ పిట్ లో వాయిస్ రికార్డర్లో నమోదు అయినట్లు ఈ నివేదిక పేర్కొంది. దీంతో ఈ ప్రమాదం వెనుక విమాన పైలట్ ఉద్దేపూర్వకంగా క్రాష్ చేశారా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

పైలట్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?:

ఎయిరిండియా 171 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం ఉద్దేశపూర్వక మానవ చర్య వల్ల జరిగి ఉండవచ్చు అనే వాదనను కొట్టివేయలేమని కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లో పైలట్ల సంభాషణలు ఈ వాదనికి బలం చేకూర్చుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. భారతదేశంలో ప్రముఖ విమానయాన నిపుణులలో ఒకరైన కెప్టెన్ మోహన్ రంగనాథన్ విమాన ఇంధన కటాఫ్ స్విచ్ ల వ్యవహరంపై కాక్ పిట్ ఆడియో అంశంపై స్పందిస్తూ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం నుంచి కూడా ఇటువంటి ప్రయత్నం జరిగితే జరిగి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైలట్లలో ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా ఇంధనాన్ని ఇంధనాన్ని ఆపే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు. నిజానికి డ్రీమ్ లైనర్ ఇంజిన్లకు ఇంధన సరఫరా స్విచ్ లో రన్, కటాఫ్ లు మాన్యువల్ గా చేయాల్సి ఉంటుందని ఇది ఆటోమెటిక్ లేదా విద్యుత్ వైఫల్యం కారణంగా చేయలేమని అని చెప్పారు. ఎందుకంటే ఇంధన సెలెక్టర్లు స్లైడింగ్ రకం కాదని అవి స్లాట్ లో ఉండేలా రూపొందించబడ్డాయని చెప్పారు. వాటిని పైకి లేదా కిందకు కదిలించాలంటే వాటికి కేటాయించిన స్లాట్ నుంచి బయకు తీయాల్సి ఉంటుందని అనుకోకుండా కట్ చేయడానికి అవకాశం ఉండదని చెప్పారు. పైలట్ల సంభాషణ బయటకు రావడంతో ఎవరైనా పైలట్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? అందులో భాగంగానే ఇంధన స్విచ్ లు ఆపేశారా? లేక మరేదైనా కుట్ర కోణం ఉందా అనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రాథమిక నివేదిక మాత్రం ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చింది.

ఖండించిన పైలట్స్ అసోసియేషన్:

మరోవైపు ఎయిరిండియా ప్రమాద ఘటనపై ఏఏఐబి ఇచ్చిన ప్రాథమిక నివేదికను పైలట్స్ అసోసియేషన్ ఖండించింది. విచారణ జరిగిన తీరు, ఆ వివరాలు వెల్లడించిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పైలట్లదే తప్పిదమని గోచరించేలా పక్షపాతధోరణిలో విచారణ నివేదిక ఉందని వ్యాఖ్యానించింది. మరో వైపు ఈ నివేదిక నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని చెప్పారు. తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని ప్రజలకు సూచించారు. మన దేశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది ఉన్నారని వారు మన పౌర విమానయానానికి వెన్నెముక వంటివారని కొనియాడారు. వారి సంక్షేమం కోసం మా ప్రభుత్వం పని చేస్తోందని ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్థారణకు రాకుండా తుది నివేదిక కోసం వేచి చూద్దామన్నారు.

Next Story