బెంగాల్‌లో ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ పక్కా.. చొరబాటుదారులను తరిమికొడతాం: అమిత్ షా

by Ramesh Naini |

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

బెంగాల్‌లో ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ పక్కా.. చొరబాటుదారులను తరిమికొడతాం: అమిత్ షా
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీర్బూమ్ జిల్లా మయూరేశ్వర్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బెంగాల్‌లో చెలరేగిపోతున్న బాంబుల సంస్కృతికి ఓటు ద్వారానే ప్రజలు బుద్ధి చెప్పాలని, ఇక్కడి నుంచి చొరబాటుదారులను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. మహిళా ముఖ్యమంత్రి ఉండి కూడా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని మమతపై మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ, ఆర్జీ కర్ ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అర్ధరాత్రి ఒంటిగంటకైనా మహిళలు స్వేచ్ఛగా, సురక్షితంగా తిరిగే వాతావరణం తీసుకొస్తామన్నారు.

చొరబాటుదారులకు ఆశ్రయం

గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పాక్ ఉగ్రవాదులకు బిర్యానీలు పెడితే, ఇప్పుడు బెంగాల్‌లో మమత ప్రభుత్వం చొరబాటుదారులకు ఆశ్రయం ఇస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నక్సలిజాన్ని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిందని గుర్తుచేశారు. మెజారిటీ వర్గాలను భయభ్రాంతులకు గురిచేయాలని టీఎంసీ చూస్తోందని విమర్శించారు. ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల రోజున టీఎంసీ గూండాలు ఇళ్లకే పరిమితం కావాలని, లేకుంటే మే 4న ఫలితాల తర్వాత అందరినీ ఏరివేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రశాంతమైన పోలింగ్ కోసం ఎన్నికల సంఘం తగిన కేంద్ర బలగాలను మోహరించిందని, ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. కేంద్రం జల్ జీవన్ మిషన్ కింద ఇచ్చిన కోట్లాది రూపాయల నిధులను టీఎంసీ నాయకులు దిగమింగారని, బెంగాల్‌లో కనీస సేవలు పొందాలన్నా ప్రజలు ‘కట్ మనీ’ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. మే 4న ఫలితాల తర్వాత రాష్ట్రంలో ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్న అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టోలోని పలు కీలక హామీలను ప్రజలకు వివరించారు.

బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలు

రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం (7th Pay Commission) అమలు, మహిళలు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం, గర్భిణులకు రూ.21,000, వృద్ధులు, వితంతువులకు రూ.2,000 చొప్పున పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, మూతపడిన జ్యూట్ మిల్లుల పునరుద్ధరణ వంటి మేనిఫెస్టోలోని కీలక హామీలను వివరించారు.

Next Story