- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijayvargiya: మహిళల వస్త్రధారణపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి
మహిళల వస్త్రధారణ విషయంలో మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ మరోసారి నోరు జారారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహిళల వస్త్రధారణ విషయంలో మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ మరోసారి నోరు జారారు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ.. "నాకు చిన్న చిన్న దుస్తులు ధరించే అమ్మాయిలు నచ్చరు" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రస్తావిస్తూ "పాశ్చాత్య దేశాలలో, తక్కువ దుస్తులు ధరించే స్త్రీని అందంగా భావిస్తారు. నేను దానితో ఏకీభవించను. ఇక్కడ భారతదేశంలో ఒక అమ్మాయి నిండుగా దుస్తులు ధరించి, నగలు ధరించి, తనను తాను అందంగా అలంకరించుకున్నప్పుడు మనం అందంగా భావిస్తాము." అని అన్నారు. షార్ట్ స్పీచెస్, షార్ట్ డ్రెస్ ను పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. "తక్కువగా మాట్లాడే నాయకుడిని మంచిగా భావించినట్లే, తక్కువ దుస్తులు ధరించే స్త్రీని చాలా అందంగా భావిస్తారని పాశ్చాత్య దేశాలలో ఒక సామెత ఉంది. కానీ నేను దానిని నమ్మను. స్త్రీ ఒక దేవతకు రూపం అని నేను నమ్ముతాను. ఆమె నిండుగా దుస్తులు ధరించాలి. పొట్టి దుస్తులు ధరించే మహిళలు నాకు ఆకర్షణీయంగా కన్పించరు. కొన్నిసార్లు అమ్మాయిలు నాతో సెల్ఫీలు తీసుకోవడానికి వస్తారు. నేను వాళ్ళకి - 'బేటా, నెక్ట్స్ టైం సరైన దుస్తులు ధరించి రండి. తర్వాత మనం ఫోటో తీసుకుంటాము' అని చెబుతాను" అని ఆయన అన్నారు.
గతంలోనూ..
ఇకపోతే, విజయవర్గీయ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. గతంలో హనుమాన్ జయంతి, మహవీర్ జయంతి సందర్భంగా ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. కొంతమంది మహిళలు చెత్త దుస్తులు ధరించి శూర్పణఖలాగా కనిపిస్తుంటారని అన్నారు. రాత్రిపూట తాను కారులో వెళుతుంటే కొంతమంది యువతులు డ్రగ్స్ మత్తులో ఊగిపోతూ కనిపిస్తుంటారని చెప్పారు. వెంటనే వాహనం దిగి వారి మత్తు దిగిపోయేలా చెంపలు వాయించాలని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. దేవుడు మనకు అందమైన శరీరాన్ని ఇచ్చాడని, మంచి వస్త్రధారణతో మరింత అందం సమకూరుతుందని కైలాశ్ విజయ్ వర్గీయ వివరించారు. అందుకే మహిళలు మంచి దుస్తులు ధరించాలని ఆయన సూచించారు. కైలాశ్ విజయ్ వర్గీయ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






