- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మునీర్, షరీఫ్ గొప్ప మనుషులు.. పాక్ లీడర్లపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు
పాక్ లీడర్లపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మునీర్, షరీఫ్ గొప్ప మనుషులని, అఫ్గాన్‌తో వాళ్ల సమస్యలను తాను తీరుస్తానని మాటిచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాకిస్తాన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇద్దరూ చాలా గొప్ప వ్యక్తులంటూ కొనియాడారు. త్వరలోనే అఫ్గానిస్తాన్-పాకిస్తాన్ మధ్య సంక్షోభాన్ని కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ట్రంప్ హామీ ఇచ్చారు. థాయిల్యాండ్, కంబోడియా మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసిన ట్రంప్.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు పెట్టే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన సమక్షంలో థాయిల్యాండ్, కంబోడియా నేతలు ఈ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో ఈ దేశాల మధ్య సుదీర్ఘ కాలం శాంతి ఉంటుందని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపిన 8 యుద్ధాల్లో ఇది ఒకటని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇంకా ఒక్క యుద్ధమే మిగిలి ఉందన్న ఆయన.. ‘పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కూడా గొడవ మొదలు పెట్టినట్లు తెలిసింది. దాన్ని కూడా చాలా త్వరగా ఆపేస్తా. నాకు ఆ రెండు దేశాలూ బాగా తెలుసు’ అన్నారు. పాక్‌లో ఫీల్డ్ మార్షల్, ప్రధాని ఇద్దరూ గొప్ప వ్యక్తులని, అఫ్గాన్‌తో వారి ఉద్రిక్తతలను చాలా త్వరగా ముగించేస్తాననడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని చెప్పారు. తాను ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదని, కానీ మంచితనంతో చేస్తున్నానని ట్రంప్ వెల్లడించారు.
‘లక్షలాది మంది ప్రాణాలు కాపాడటం చాలా గొప్ప విషయం. అంతన్నా మంచి పని ఇంకేముంటుంది? కానీ ఇలా అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో 8 యుద్ధాలు ఆపడం ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందని నేననుకోవట్లేదు. అసలు ఏ అధ్యక్షుడూ ఒక్క యుద్ధం ఆపినట్లు కూడా నాకు గుర్తురావట్లేదు. యుద్ధాలు వాళ్లే మొదలు పెట్టేవాళ్లు’ అని పేర్కొన్నారు.






