భారత్-పాక్ సహా ఏడు యుద్ధాలు ఆపా.. ప్రతి యుద్ధానికి ‘నోబెల్’ రావాలి: ట్రంప్

by Phanindra |

భారత్-పాక్ సహా ఏడు యుద్ధాలు ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఇలా ఆపిన ప్రతి యుద్ధానికి ఒక ‘నోబెల్’ రావాలన్నారు.

భారత్-పాక్ సహా ఏడు యుద్ధాలు ఆపా.. ప్రతి యుద్ధానికి ‘నోబెల్’ రావాలి: ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని ప్రకటించారు. వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుకొని తాను ఈ యుద్ధాన్ని ఆపానన్నారు. తాను మొత్తం 7 యుద్ధాలు ఆపానని, కాబట్టి తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. ‘ప్రపంచ వేదికపై ఇంతకవరకు మనకు దక్కనంత గౌరవం దక్కుతోంది. అలాంటి పనులు చేస్తున్నాం. యుద్ధాలు ఆపి, శాంతి ఒప్పందాలు చేయిస్తున్నాం. ఇండియా-పాకిస్తాన్, థాయిల్యాండ్-కంబోడియా వంటి యుద్ధాలన్నీ ఆపాం’ అని ట్రంప్ ప్రకటించారు.

భారత్-పాకిస్తాన్, థాయిల్యాండ్-కంబోడియా, అర్మీనియా-అజర్‌బైజాన్, కోసోవో-సెర్బియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథియోపియా, ర్వాండా-కాంగో.. ఈ యుద్ధాలన్నీ తాను ఆపానన్నారు. వీటిలో 60 శాతం యుద్ధాలు వాణిజ్యం వల్లనే ఆగాయన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపితే తనకు నోబెల్ బహుమతి దక్కాలని కొందరు అంటున్నారని, మరి మిగతా యుద్ధాల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. తాను ఆపిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ బహుమతి దక్కాలన్నారు.

Next Story