48వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం.. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-01-20 18:11:20  IST  )

వరుసగా కాకుండా రెండో సారి అమెరికాకు అధ్యక్షుడు అయిన రెండో వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు సృష్టించారు.

48వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం.. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్
X

- ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్

- క్యాపిటల్ హిల్ రోటుండాలో అట్టహాసంగా వేడుకలు

దిశ, నేషనల్ బ్యూరో:

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హల్ రోటుండాలో 25 వేల మంది అతిథుల సమక్షంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ వీరి చేతి ప్రమాణం చేయించారు. 1861లో అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారంలో ఉపయోగించిన బైబిల్‌తో పాటు తన బైబిల్‌ను కూడా పట్టుకొని డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. వరుసగా కాకుండా రెండో సారి అమెరికాకు అధ్యక్షుడు అయిన రెండో వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు సృష్టించారు. నిరుడు నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ రెండో సారి విజయం సాధించారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాతో పాటు హిల్లరీ క్లింటన్, లారా బుష్ హాజరయ్యారు. సుప్రీంకోర్టుకు చెందిన తొమ్మిది మంది జడ్జిలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

భారత్ తరపున జై శంకర్..

డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ హాజరయ్యారు. డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోడీ రాసిన లేఖను ఇండియా ప్రతినిధిగా హాజరైన జై శంకర్ అందించనున్నారు. భారత్ తరపున ప్రాతినిథ్యం వహించే అరుదైన గౌరవం తనకు దక్కడం చాలా ఆనందంగా ఉందని జై శంకర్ అన్నారు. ఇక ఇండియా నుంచి ఆహ్వానం అందుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

పడి లేచిన కెరటం

అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడం ఒక అద్భుతమైన విషయం. అమెరికా చరిత్రలో ఓడిపోయిన తర్వాత తిరిగి రెండో సారి అధ్యక్షుడు అయిన రెండో వ్యక్తిగా ట్రంప్ నిలిచారు. 2021 జనవరిలో వాషింగ్టన్ డీసీలో జరిగిన అల్లర్ల వెనుక ట్రంప్ ఉన్నాడనే అభియోగాలపై.. నిరుడు మేలో న్యూయార్క్ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్‌ను అల్లర్ల కేసులో దోషిగా తీర్పు ఇచ్చింది. అమెరికా చరిత్రలో తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొని, దోషిగా తేలిన మొదటి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. అతడిపై మోపిన 34 నేరాలలో దోషిగా తేలాడు. అందులో 2020 అధ్యక్ష ఎన్నికలను చట్ట విరుద్దంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన కేసు కూడా ఉంది. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొని, దోషిగా తేలిన వ్యక్తి.. తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, అమెరికాకు గత వైభవాన్ని తీసుకొస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' (మగా) నినాదంతో యువతను, సాంప్రదాయ క్రైస్తవులను, నేటీవ్ అమెరికన్లను ఆకట్టుకోవడంలో ట్రంప్ సఫలం అయ్యారు. ఇక ట్రంప్‌కు తోడుగా యువకుడైన జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన భార్య ఉషా బాల చిలుకూరి తెలుగు మూలాలున్న మహిళ కావడం గమనార్హం.

Next Story