- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం పీఠంపై పట్టువీడని డీకే శివకుమార్.. రంగంలోకి రాహుల్ గాంధీ
కర్ణాటక రాష్ట్రంలో సీఎం పదవి మార్పు పై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలో సీఎం పదవి మార్పు పై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య (Siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తే తాను సీఎంగా కొనసాగుతానని, నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం హైకమాండ్‌దేనని ఆయన తెలిపారు. కానీ మరోపక్క డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన తరఫున ఎమ్మెల్యేలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు పై గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మరింతగా కేంద్రీకృతమైంది. ఈ సుదీర్ఘ రాజకీయ పంచాయతీపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నేతలతో విస్తృత చర్చలు జరిపారు.
అయితే, ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవాలనే విషయంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar) ఏ మాత్రం పట్టు విడవక పోవడం, అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. ఈ కీలక పరిణామాల మధ్య ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (AICC President Mallikarjun Kharge) కూడా ఢిల్లీ చేరుకున్నారు. నిన్న మొత్తం కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక అంశంపైనే లోతుగా చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి మార్పు- అధికార పంపిణీకి సంబంధించి ఒక తుది నిర్ణయానికి రావడానికి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో, త్వరలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లను ఢిల్లీకి పిలిపించి నేరుగా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటక రాజకీయ సంక్షోభానికి మరో రెండు మూడు రోజుల్లో తెర పడుతుందని, అంతర్గత చర్చల ద్వారా ఒక పరిష్కారం లభిస్తుందని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.






