Delhi stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాటకు కారణం ఏంటంటే?

by Shamantha N |

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైలు పేర్లలో గందరగోళమే కారణమని పోలీసులు చెబుతున్నారు.

Delhi stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాటకు కారణం ఏంటంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైలు పేర్లలో గందరగోళమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రయాగ్‌ రాజ్‌కు వెళ్లే రెండు రైళ్లకు దాదాపు ఒకేలాంటి పేరుండటంతో ప్రయాణికులు కన్ఫ్యూజ్ అయ్యారని పేర్కొన్నారు. “శనివారం రాత్రి తొలుత ప్రయాగ్‌రాజ్‌ స్పెషల్‌ రైలు ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ 16పైకి వస్తుందని అనౌన్స్‌మెంట్‌ చేశారు. మరోవైపు, 14 నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ అప్పటికే ఉంది. దాన్నే తాము ఎక్కాల్సిన రైలుగా భావించి కొందరు అక్కడకు చేరారు. కానీ, అనౌన్స్‌మెంట్‌ వినగానే.. తాము ఎక్కాల్సిన రైలు 16వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వద్దకు వస్తోందని.. దాన్ని అందుకోలేమని కొందరు కంగారు పడ్డారు. దీంతో, ఒక్కసారిగా వందలాది మంది ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ 16 వైపు పరుగులు పెట్టారు. అప్పటికే 12,13, 14 ప్లాట్‌ఫారంలు ప్రయాణికులతో నిండిపోయాయి. అంతేకాకుండా 16వైపు వెళ్లేవారి హడావుడితో తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్‌రాజ్‌ వెళ్లేందుకు ఆ సమయంలో 4 రైళ్లు ఉన్నాయి. వాటిల్లో మూడు ఆలస్యమయ్యాయి. దీంతో చాలా మంది యాత్రికులు 14వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌పైకి చేరారు.” అని పోలీసులు తెలిపారు.

రైళ్లు రద్దు చేయలేదు..

అంతేకాకుండా, రైళ్లను రద్దు చేయలేదని, ప్లాట్ ఫాంలను మార్చలేదని.. అన్ని రైళ్లు షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయని ఉత్తర రైల్వే సీపీఆర్వో హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి రైల్వేలు ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ డియో, ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ పంకజ్ గంగ్వార్ ఈ కమిటీలో భాగమని అధికారులు తెలిపారు. కాగా.. తొక్కిసలాట ఘటనపై విచారణ ప్రారంభించిన కమిటీ.. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ అన్ని ఫుటేజ్ లని భద్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనలో 18 మంది చనిపోయారు. మృతుల్లో 11 మంది మహిళలు ఉండగా.. మరో నలుగురు పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో మరో డజను మంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనలో మృతులకు రైల్వేశాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.

Next Story