రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల వైభవం.. భావోద్వేగానికి గురైన ధర్మేంద్ర కుమార్తె

by Ramesh Naini |

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం (మే 25) న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత ఘనంగా జరిగింది.

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల వైభవం.. భావోద్వేగానికి గురైన ధర్మేంద్ర కుమార్తె
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల (2026) ప్రదానోత్సవం సోమవారం (మే 25) న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు సహా తదితర ప్రముఖులు హాజరయ్యారు.

కన్నీటి పర్యంతమైన ధర్మేంద్ర కుమార్తె..

బాలీవుడ్ దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన తరఫున ఆయన సతీమణి, నటి హేమామాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతేడాది నవంబర్ 24, 2025న 89 ఏళ్ల వయసులో ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. హేమామాలిని ఈ అవార్డు తీసుకుంటున్న సమయంలో సభలో ఆసీనులైన ధర్మేంద్ర పెద్ద కుమార్తె విజేత డియోల్ తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.

వినోద రంగానికి పద్మ కళ.. అవార్డు గ్రహీతలు వీరే

సినిమా, వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ ఏడాది పద్మ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, బాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్‌లు ‘పద్మ భూషణ్’ పురస్కారాలను స్వీకరించారు. అలాగే, భారతీయ అడ్వర్టైజింగ్ దిగ్గజం పీయూష్ పాండేకు కూడా పద్మభూషణ్ దక్కగా, ఆయన తరఫున ఆయన సతీమణి నీతూ జోషి ఈ అవార్డును రాష్ట్రపతి నుండి అందుకున్నారు. నటుడు ఆర్. మాధవన్, బెంగాలీ స్టార్ నటుడు ప్రొసేన్‌జిత్ ఛటర్జీతో పాటు దివంగత నటుడు సతీష్ షాలకు ‘పద్మశ్రీ’' పురస్కారాలు లభించాయి. ప్రొసేన్‌జిత్ ఛటర్జీ అచ్చమైన సంప్రదాయ బెంగాలీ దుస్తులు ధరించి వచ్చి ఈ పురస్కారాన్ని అందుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

కాగా, కళలు, సామాజిక సేవ, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ తదితర రంగాల్లో అసాధారణ, విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఏటా సత్కరిస్తున్న విషయం తెలిసిందే. అత్యున్నత, అసాధారణ సేవలకు పద్మ విభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించిన వారికి పద్మశ్రీ పురస్కారాలను అందజేస్తారు.

Next Story