Dharavi: ధారావి ప్రాజెక్టుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ.. అదానీ గ్రూపునకు భారీ ఊరట

by B.Srinivas |

మహారాష్ట్రలోని ముంబైలో ధారావి రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం జరుగుతున్న నిర్మాణ పనులను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

Dharavi: ధారావి ప్రాజెక్టుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ.. అదానీ గ్రూపునకు భారీ ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ముంబైలో ధారావి రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (DRP) కోసం జరుగుతున్న నిర్మాణ పనులను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు (Supreme court) నిరాకరించింది. గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ ప్రాజెక్టును అదానీ ప్రాపర్టీస్ ప్రయివేట్ లిమిటెడ్‌కు ఇవ్వాలనే మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్ప్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అదానీ గ్రూప్ (Adani Group) టెండర్‌ను రద్దు చేయాలని తెలిపింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని స్పష్టం చేసింది. కొన్ని రైల్వే క్వార్టర్స్ సైతం కూల్చి వేశారని కాబట్టి దీనిపై స్టే ఇవ్వడం కుదరదని తెలిపింది. ఆదానీ గ్రూపునకు టెండర్ ఇవ్వడాన్ని సమర్థించింది. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని చెల్లింపులను ఎస్ర్కో ఖాతా నుంచి మాత్రమే చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 25వ తేదీకి వాయిదా వేసింది.

ముంబైలోని ధారావిని అభివృద్ధి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 2019 లో టెండర్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టుకు బిడ్డింగ్ వేయగా యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్ప్ సంస్థ ఈ ప్రాజెక్టును రూ.7,200 కోట్లకు కైవసం చేసుకుంది. అనంతరం 2019- 2022 మధ్య ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం టెండర్‌ను రద్దు చేసింది. అనంతరం 2022లోనే అదానీ గ్రూపునకు ఈ ప్రాజెక్టు అప్పగించింది. దీంతో ఈ విషయంపై సెక్లింగ్ సంస్థ బాంబే హైకోర్టులో అప్పీల్ చేయగా న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయం సరైందేనని తెలిపింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో అదానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది.

Next Story