Dhankhar: దేశ ఎన్నికల ప్రక్రియలో అక్రమ వలసదారుల జోక్యం.. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్

by B.Srinivas |

దేశ ఎన్నికల ప్రక్రియలో అక్రమ వలసదారులు జోక్యం చేసుకుంటున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఆరోపించారు.

Dhankhar: దేశ ఎన్నికల ప్రక్రియలో అక్రమ వలసదారుల జోక్యం.. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ ఎన్నికల ప్రక్రియలో అక్రమ వలసదారులు జోక్యం చేసుకుంటున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ (Jagadheep dhankad) ఆరోపించారు. శనివారం ఆయన మహారాష్ట్రలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీ (Maratwada University) 65వ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. అక్రమ వలసదారులను అమెరికా ప్రభుత్వం బహిష్కరించడంపై ఆయన స్పందిస్తూ.. భారత్‌లోనూ ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందని ప్రతి భారతీయుడు ప్రశ్నించాలన్నారు. ‘దేశంలో నివసించే హక్కు లేని అనేక మంది భారత్‌లో నివసిస్తున్నారు. ఇక్కడ జీవనోపాధిని పొందుతున్నారు. మన వనరులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేగాక అక్రమ వలసదారులు ఎన్నికల ప్రక్రియలోనూ జోక్యం చేసుకుంటున్నారు’ అని తెలిపారు. ప్రతి భారతీయుడు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కొన్ని దేశాలు ఇటీవల అక్రమ భారతీయ పౌరులను బహిష్కరిస్తున్నాయని, ఈ ప్రక్రియను మన దేశంలో ఎప్పుడు ప్రారంభిస్తామనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తాలన్నారు. మతమార్పిడులపై ఆయన స్పందిస్తూ. ఒక వ్యక్తి ఏ మతాన్ని అయినా స్వీకరించొచ్చని, కానీ ప్రలోభాల ద్వారా మార్పిడులు జరగడం సరికాదని తెలిపారు. భారతదేశ జనాభాను మార్చడం ద్వారా ఆధిపత్యాన్ని పొందడమే దీని ఉద్దేశ్యమని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు.

Next Story