DGCA: విమానాశ్రయాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ

by S Gopi |

విమానాలతో పాటు, రన్‌వేలు, ఇతర విభాగాల్లో అనేక లోపాలు ఉన్నట్టు తేల్చింది.

DGCA: విమానాశ్రయాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిర్ఇండియా విమానం కూలిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో అప్రమత్తమైన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన విమానాయాన భద్రతపై తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో విమానాశ్రయాల్లోని అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. విమానాలతో పాటు, రన్‌వేలు, ఇతర విభాగాల్లో అనేక లోపాలు ఉన్నట్టు తేల్చింది. డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో రెండు టీమ్‌లు ఢిల్లీ, ముంబై సహా ప్రధాన విమానాశ్రయాలను సందర్శించాయి. విమాన కార్యకలాపాలు, ర్యాంప్ భద్రత, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), కమ్యూనికేషన్, నావిగేషన్, సర్వైలెన్స్ వ్యవస్థలు(సీఎన్ఎస్), ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎవల్యూయేషన్స్ వంటి అనేక కీలక విభాగాల్లో ఈ తనిఖీలు నిర్వహించినట్టు తెలిపింది.

విస్తుపోయే లోపాలు

ముఖ్యంగా ఆందోళనకర స్థాయిలో కొన్ని లోపాలను డీజీసీఏ గమనించింది. విమానాశ్రయంలోని రన్‌వేపై దెబ్బతిన్న సెంటర్ లైన్ మార్కింగ్ నుంచి మూడేళ్లుగా డేటాను అప్‌డేట్ చేయకపోవడం, టైర్లు అరిగిపోయిన కారణంగా షెడ్యూల్ చేసిన విమానం నిలిచిపోవడం వరకు ఏవియేషన్ ఎకోసిస్టమ్‌లో అనేక లోపాలను గుర్తించింది. లోపాలకు సంబంధించి విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, సంస్థల పేర్లను బహిర్గతం చేయకుండా మంగళవారం డీజీసీఏ కీలక హెచ్చరికలు జారీ చేసింది. సమగ్రమైన పర్యవేక్షణ లేకపోవడాన్ని, సమస్యల పరిష్కారంలో విమానయాన సంస్థలు ఉదాసీనతను స్పష్టం చేస్తున్నాయని డీజీసీఏ పేర్కొంది. వీటికి సంబంధించి విమానాశ్రయాలకు తెలియజేశామని, తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విమాన ప్రయాణాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందులో రాజీకి తావులేదని అధికారులు వెల్లడించారు.

Next Story