డాక్టర్ ముసుగులో రాక్షసి? అమెరికాలో సంచలనం రేపుతున్న భారత సంతతి మహిళ కేసు!

by Ramesh Naini |

అమెరికాలో తన నాలుగేళ్ల కుమార్తెను హత్య చేసి, ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయిందంటూ కట్టుకథ అల్లిన భారత సంతతి డాక్టర్ నేహా గుప్తా ఉదంతం మరోసారి సంచలనంగా మారింది.

డాక్టర్ ముసుగులో రాక్షసి? అమెరికాలో సంచలనం రేపుతున్న భారత సంతతి మహిళ కేసు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో తన నాలుగేళ్ల కుమార్తెను హత్య చేసి, ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయిందంటూ కట్టుకథ అల్లిన భారత సంతతి డాక్టర్ నేహా గుప్తా ఉదంతం మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా అమెరికా పోలీసులు సంచలనమైన '911' అత్యవసర కాల్ రికార్డింగ్‌ను విడుదల చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 2025లో ఫ్లోరిడాలోని ఎల్ పోర్టల్‌లో ఉన్న ఒక హాలిడే రెంటల్ ప్రాపర్టీ వద్ద ఈ ఘటన జరిగింది. పిడియాట్రీషియన్ (పిల్లల వైద్యురాలు) అయిన నేహా గుప్తా, తన కుమార్తె ఆరియా పూల్‌లో పడిపోయిందని పోలీసులకు ఫోన్ చేశారు.

పోలీసులు విడుదల చేసిన కాల్ రికార్డింగ్‌..

‘నా కూతురు పూల్ అడుగు భాగంలో ఉంది. మేమంతా నిద్రపోతున్నాం, ఏదో శబ్దం వినిపిస్తే లేచి చూశాను. తను పూల్‌లో ఉంది. నేను కాపాడటానికి ప్రయత్నించాను కానీ నాకు ఈత రాదు’ అని నేహా ఆందోళనగా మాట్లాడుతున్నట్లు రికార్డింగ్‌లో ఉంది. అయితే, రెస్క్యూ టీమ్ వచ్చి పాపను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పోస్టుమార్టం నివేదికతో బయటపడ్డ నిజం..

ప్రారంభంలో ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ, శవపరీక్ష నివేదిక పోలీసులను విస్మయానికి గురిచేసింది. పాప నీటిలో మునిగి చనిపోతే ఊపిరితిత్తులలో, కడుపులో నీరు ఉండాలి. కానీ, ఆరియా శరీరంలో చుక్క నీరు కూడా లేదు (Dry lungs). పాప నోటి లోపల గాయాలు, బుగ్గలపై కమిలిన గుర్తులు ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ఊపిరాడకుండా చేయడం (Smothering/Asphyxiation) వల్లే పాప చనిపోయిందని, చనిపోయిన తర్వాతే స్విమ్మింగ్ పూల్‌లో పడేశారని తేలింది.

కుటుంబ కలహాలే కారణమా?

నేహా గుప్తా తన భర్త డాక్టర్ సౌరభ్ తలాఠీ నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. వారి మధ్య కుమార్తె కస్టడీ కోసం కోర్టులో వివాదం నడుస్తోంది. తన అనుమతి లేకుండానే నేహా పాపను ఓక్లహోమా నుంచి ఫ్లోరిడాకు తీసుకువచ్చిందని సౌరభ్ పోలీసులకు తెలిపారు. నేహా గుప్తా తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని నిర్ధారించిన మయామి-డేడ్ పోలీసులు, ఆమెపై సెకండ్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు ముందే మే 2025లో ఆమె పనిచేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ ఓక్లహోమా యాజమాన్యం ఆమెను విధుల్లో నుంచి తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కాల్ రికార్డింగ్ బయటకు రావడంతో అమెరికాలోని భారతీయ సమాజంలో ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ ముసుగులో ఉన్న రాక్షసి అంటూ ఎన్ఆర్ఐలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story