- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గన్ పాయింట్ పై బెంగాల్ ప్రజాస్వామ్యం : దీదీపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విసుర్లు
ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయను అని చెప్పడంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరించడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ప్రస్తుతం "గన్ పాయింట్" వద్ద ఉందని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించేందుకు మమత ససేమిరా అంటున్నారని ఆయన మండిపడ్డారు.
అధికారం మీ హక్కు కాదు..
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల ఫలితాలను మమతా బెనర్జీ ఒక సూచనగా మాత్రమే చూస్తున్నారని, ప్రజల గొంతుకగా గుర్తించడం లేదని ఆరోపించారు. "అధికారాన్ని ఆమె ఒక బాధ్యతగా కాకుండా, కేవలం తన హక్కుగా (Entitlement) భావిస్తున్నారా?" అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలో మొండితనాన్ని పరిపాలనా దక్షతగా గుర్తించరని, జవాబుదారీతనం అనేది ఐచ్ఛికం కాదని ఆయన చురకలంటించారు. అధికారాన్ని అంటిపెట్టుకోవాలనే తాపత్రయంలో మమతా బెనర్జీ.. ఎన్నికల కమిషన్, భద్రతా దళాల వంటి రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని ప్రధాన్ ఆరోపించారు. బెంగాల్ ప్రజలు భయాన్ని, ఒత్తిడిని తిరస్కరించి మార్పు కోరుకున్నారని, ఈ తీర్పును విస్మరించడం ప్రజాస్వామ్య పునాదులనే కూల్చివేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 207 స్థానాలతో భారీ విజయం సాధించి, 15 ఏళ్ల టీఎంసీ పాలనకు చరమగీతం పాడింది. అయితే.. కౌంటింగ్‌లో భారీ అక్రమాలు జరిగాయని, దాదాపు 100 స్థానాల్లో తమ మెజారిటీని దోచుకున్నారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. "నేను ఓడిపోలేదు, ఇది ఒక కుట్ర. నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు, లోక్ భవన్‌కు వెళ్లను. రాజ్యాంగపరంగా వారు ఏ చర్యలైనా తీసుకోవచ్చు" అని ఆమె స్పష్టం చేశారు. బెంగాల్‌లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ, అధికార మార్పిడి విషయంలో దీదీ మొండిగా వ్యవహరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.






