Viral: డెలివరీ బాయ్‌పై ఘోరంగా దాడి, హెల్మెట్‌తో గుండెపై కొట్టి.. వీడియో వైరల్

by Ramesh Naini |

బెంగళూరు నగరంలోని మహాదేవపుర పరిధి కగ్గదాసపురలో జరిగిన చిన్న రోడ్డు ప్రమాదం తీవ్ర హింసకు దారి తీసింది.

Viral: డెలివరీ బాయ్‌పై ఘోరంగా దాడి, హెల్మెట్‌తో గుండెపై కొట్టి.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు నగరంలోని మహాదేవపుర పరిధి కగ్గదాసపురలో జరిగిన చిన్న రోడ్డు ప్రమాదం తీవ్ర హింసకు దారి తీసింది. విధి నిర్వహణలో ఉన్న జెప్టో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ దీపక్‌కుమార్‌పై ఇద్దరు వ్యక్తులు అమానుషంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. జనవరి 4 సాయంత్రం సమయంలో కగ్గదాసపుర 29వ క్రాస్‌ జంక్షన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జెప్టో గోడౌన్‌ నుంచి ఆర్డర్‌ తీసుకుని స్కూటీపై వెళ్తున్న దీపక్‌కుమార్‌ను ఎదురుగా వస్తున్న హోండా ఆక్టివాపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఢీకొట్టారు. దీంతో వారు కిందపడిపోయారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించాల్సిన బదులు, ఆ ఇద్దరు యువకులు దీపక్‌కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు.

ముఖంపై పిడిగుద్దులు కురిపించి, రోడ్డుపై పడేసి తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో ఒకరు హెల్మెట్‌తో అతడి గుండెపై బలంగా కొట్టడంతో దీపక్ రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా దుండగులు వారిని తప్పించుకుని మళ్లీ దాడి కొనసాగించారు. చివరకు ఒక వృద్ధుడు ధైర్యంగా ముందుకు వచ్చి అడ్డుకోవడంతో, స్థానికుల సహకారంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో వైరల్‌ అయింది. వీడియో ఆధారంగా బైయప్పనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. వీడియో ఇదే..

Next Story