కొత్త ఈవీ పాలసీ .. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై భారీ సబ్సిడీలు

by Malleboina Mahesh |

ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ విడుదల! ఎలక్ట్రిక్ కార్లపై ₹1 లక్ష వరకు స్క్రాపింగ్ ఇన్సెంటివ్. టూ వీలర్లకు ₹30 వేల సబ్సిడీ. రోడ్డు టాక్స్ 100% రద్దు.

కొత్త ఈవీ పాలసీ .. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై భారీ సబ్సిడీలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్ది సంవత్సరాలుగా వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారిన విషయం తెలిసిందే. ఈ వాయు కాలుష్యాన్ని అరికట్టి, పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా.. ఎలక్ట్రిక్ వాహన పాలసీ 2026–2030 ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి గతంలో కంటే మెరుగైన నగదు ప్రోత్సాహకాలను (Incentives) ప్రకటించింది. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఢిల్లీలోని మొత్తం వాహనాల్లో అత్యధిక శాతం విద్యుత్ వాహనాలే ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త నిబంధనలు మార్చి 31, 2030 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

నగదు ప్రోత్సాహకాలు ఎలా అంటే..?

ఈ కొత్త పాలసీలో వాహనాల రకాన్ని బట్టి మొదటి మూడు సంవత్సరాల పాటు విభిన్న స్థాయిలో సబ్సిడీలను అందించనున్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ల కొనుగోలుపై మొదటి ఏడాది గరిష్టంగా ₹30,000 వరకు, ఈ-ఆటోలపై ₹50,000 వరకు, ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలపై అత్యధికంగా ₹1,00,000 వరకు నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే, ఈ సబ్సిడీ మొత్తం ప్రతి ఏడాది క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను తుక్కుగా (Scrapping) మార్చి కొత్త ఈవీని కొంటే, కార్లపై అదనంగా ₹1,00,000 వరకు భారీ రాయితీని ప్రభుత్వం కల్పించింది.

రిజిస్ట్రేషన్, రోడ్డు టాక్స్ మినహాయింపు..

వాహనదారులకు ఆర్థిక భారం తగ్గించేలా ఢిల్లీలో నమోదయ్యే ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి 100% మినహాయింపు ఇచ్చారు. అయితే, ఈ పూర్తి పన్ను మినహాయింపు కేవలం ₹30 లక్షల లోపు ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ వాహనాలకు ఈ రాయితీ వర్తించదు. ఈ సమగ్ర విధానం వల్ల ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగి, కాలుష్య నివారణలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది.

Next Story