ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలు నెరవేరేనా?

by Ajay Maddhiboyina |

కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పదే పదే ఒక విషయాన్ని చెబుతున్నారు. ముస్లింలు, మైనార్టీల కోసం నిలబడుతోంది ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని గుర్తు చేస్తున్నారు.

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలు నెరవేరేనా?
X

- ముస్లిం ఓట్లపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్

- మైనార్టీలు తమ వైపే అని ఆప్ ధీమా

- హిందూ ఓట్ల ఏకీకరణకు బీజేపీ ప్రయత్నాలు

- కీలకంగా మారిన 12.86 శాతం మైనార్టీలు

దిశ, నేషనల్ బ్యూరో:

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా.. మూడు దశాబ్దాల క్రితం కోల్పోయిన ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. గెలుపుపై పెద్దగా అంచనాలు లేకపోయినా కనీసం డబుల్ డిజిట్ ఫిగర్ సాధించాలని భావిస్తోంది. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ముస్లిం ఓటర్లపై నమ్మకం పెట్టుకుంది. ఇన్నాళ్లూ ఆప్‌కు మద్దతుగా ఉన్న ముస్లింలు ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ వైపు టర్న్ అవుతారని అంచనాలు వేసుకుంది. ఇందుకు 2022 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గణాంకాలను చూపిస్తోంది. 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన కొన్ని రోజులకే ఈశాన్య ఢిల్లీలో మత కలహాలు చెలరేగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌తో సరిహద్దు కలిగిన ఈ ప్రాంతంలో అనేక మతాల వాళ్లు నివసిస్తున్నారు. వివిధ మతాల ప్రజలతో పాటు వలస జనాభా అధికంగా ఉంటుంది.

ఈ ప్రాంతంలో ఉన్న ఆరు నియోజకవరగాల్లో ఆప్ అభ్యర్థులే గెలిచారు. కానీ అల్లర్లు చోటు చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ పర్యటించలేదు. అంతే కాకుండా ఆప్ ప్రభుత్వం కూడా బాధితుల కోసం పెద్దగా చేసిందేమీ లేదు. ఈ ఆరు నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 35 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. అల్లర్ల సమయంలో ఎక్కువగా నష్టపోయింది కూడా ఆ కమ్యూనిటీయే. అయితే ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ డీఎస్. మురళీధర్ సూచన మేరకు సీఎం అర్వింద్ కేజ్రివాల్ కొన్ని ప్రాంతాలను సందర్శించారు. అయితే ముస్లిం సామాజిక వర్గం కేజ్రివాల్ పర్యటనను మనస్పూర్తిగా అంగీకరించలేదు. 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా ఐదు వార్డులు గెలిచింది. అలాగే ముస్లిం మెజార్టీ ప్రాంతాలైన ఓక్లా, జాకిర్ నగర్‌లో రెండు వార్డుల్లో విజయం సాధించింది. ఈ పరిణామాలు గమనించిన తర్వాతే.. ముస్లిం ఓటర్లు ఆప్‌ను కాదనుకుంటే కాంగ్రెస్ వైపుకు వెళ్తారని విశ్లేషకులు ఒక అంచనాకు వచ్చారు.

మీ కోసం నిలబడింది మేమే..

కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పదే పదే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముస్లింలు, మైనార్టీల కోసం నిలబడుతోంది ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ అల్లర్ల సమయంలో మీకు తోడుగా ఉన్నదెవరు? సంభాల్, హత్రాస్, కశ్మీర్, మణిపూర్ కాలిపోతున్నప్పుడు మీ వెంట ఉన్నది ఏ పార్టీనో గుర్తు తెచ్చుకోండని అంటున్నారు. రాహుల్ గాంధీ ముస్లిం, మైనార్టీల వైపు ఎప్పుడూ నిలబడే ఉన్నారని.. కానీ మీరు మాత్రం కాంగ్రెస్‌కు ఓటేయకుండా అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ముస్లిం, మైనార్టీ ఓటర్లు ఒక్క సారిగా ఆప్ వైపు రాలేదు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ గద్దె దించాలని తీవ్రంగా పోరాడింది. అయితే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఆప్ కాగలదో లేదో అనే డైలమాలో ముస్లిం మైనార్టీలు ఉన్నారు. అందుకే వాళ్లు పూర్తిగా ఆప్‌ వైపు రాలేదు. కానీ ఆ ఎన్నికల్లో ఆప్ చెప్పుకోదగిన సీట్లు తెచ్చుకున్న తర్వాతే నమ్మకం వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వదిలి పూర్తిగా ఆప్ వైపుకు వచ్చారు. ఆ ఎన్నికల్లో ఆప్ అద్బుతమైన విజయాన్ని సాధించిన విషయం గుర్తు చేస్తున్నారు.

మరి ఇప్పుడు ఆప్ నుంచి కాంగ్రెస్ వైపుకు ఆ ఓటర్లందరూ తిరిగి వస్తారా అంటే పూర్తిగా నమ్మలేని పరిస్థితి. తిరిగి వచ్చినా.. కాంగ్రెస్ అధికారంలోకి రాలేని పరిస్థితి. ఇందుకు గల కారణాలను కూడా స్ట్రాటజిస్టులు విశ్లేషిస్తున్నారు. ముస్లిం ఓటర్లు భారీగా కాంగ్రెస్‌కు ఓటు వేసినా.. హిందువుల ఓట్లు పడకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే. అయితే గతంలో బీజేపీతో వ్యతిరేకించి హిందువులు ఆప్‌కు ఓటేశారు. కానీ ఆప్ 12 ఏళ్ల పాలన చూసిన చాలా మంది హిందువులు నెమ్మదిగా తమ స్టాండ్‌ను మార్చుకుంటున్నారు. ఇది ఆప్‌కు పెద్ద దెబ్బగా మారుతుందని తెలుస్తోంది.

హిందువుల ఏకీకరణ..

హిందువుల ఓట్ల ఏకీకరణకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇది ఆప్‌కు మాత్రమే కాకుండా కాంగ్రెస్‌కు కూడా పెద్ద ఎదురు దెబ్బగా మారవచ్చు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో హిందువుల ఓట్లు చీలకుండా ఎలక్షనీరింగ్ మొదలు పెట్టాయి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ విధంగా అయితే హిందువుల ఓట్లను ఆర్ఎస్ఎస్ పోలరైజ్ చేసిందో.. ఇప్పుడు ఢిల్లీలో కూడా అనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. హిందువులందరినీ ఒకేలా ట్రీట్ చేయకుండా.. సామాజిక వర్గాల వారీగా వారిని బీజేపీ వైపు తిప్పడానికి ఆర్ఎస్ఎస్ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా ముస్లింల డామినేషన్ ఉండే నియోజకవర్గాల్లో హిందువుల ఓట్లు చీలకుండా బీజేపీ జాగ్రత్త పడుతోంది. అదే జరిగితే ముస్లిం డామినేషన్ ఉండే నియోజక వర్గాల్లో కేవలం హిందువుల ఓట్లతోనే గెలిచే అవకాశాలు బీజేపీకి ఏర్పడతాయి.

కాంగ్రస్ ఆశలకు ఆప్, మజ్లిస్ అడ్డంకి..

ముస్లిం ఓట్లపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. 12 ఏళ్ల ఆప్ పాలనపై విసిగిపోయిన మైనార్టీలు తప్పకుండా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని భావిస్తోంది. అయితే కాంగ్రెస్ వైపు ముస్లింలు మూకుమ్మడిగా తిరగడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. ముస్లిం డామినేషన్ ప్రాంతాల్లో గతంలో కాంగ్రెస్ నాయకులుగా మంచి పేరు సంపాదించిన వాళ్లు ఇప్పుడు ఆప్‌లో ఉన్నారు. వీరిలో కొంత మంది ఆప్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. తమ సొంత చరిష్మాతోనే గెలిచే సత్తా వీరికి ఉంది. మరోవైపు ముస్లింల ఓట్లను మజ్లిస్ పార్టీ చీలుస్తుందనే అనుమానాలు ఉన్నాయి. ఆ అడ్డంకులను కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు అధిగమించడం కష్టమే. కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు పొందే అవకాశం ఉన్నా.. యాంటీ బీజేపీ ఓట్లు చీలిపోవడం పెద్ద మైనస్‌గా విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంచనాలు నెరవేరడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. మరి ఆ అడ్డంకులను కాంగ్రెస్ అధిగమిస్తుందో లేదో చూడాలి.

Next Story