చెల్లిపై ఈర్ష్య.. కన్నతల్లి ఇంటికే కన్నం పెట్టిన మహిళ

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : ఓ మహిళ బురఖా ధరించి వెళ్లి ఏకంగా తన తల్లి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది.

చెల్లిపై ఈర్ష్య.. కన్నతల్లి ఇంటికే కన్నం పెట్టిన మహిళ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఓ మహిళ బురఖా ధరించి వెళ్లి ఏకంగా తన తల్లి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది. లక్షలు విలువైన నగలు, నగదును అపహరించింది. జనవరి 30న మధ్యాహ్నం ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఉన్న ఒక ఇంట్లో చోటుచేసుకున్న ఈ దోపిడీ వ్యవహారం ఇప్పుడు వెలుగుచూసింది. తన ఇంట్లోని రూ.1.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయంటూ కమలేష్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు ప్రారంభమైంది. చోరీ జరిగిన ఇంట్లోకి దొంగ బలవంతంగా ప్రవేశించిన సాక్ష్యాలేవీ పోలీసులకు దొరకలేదు. ఆ ఏరియాలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసు టీమ్.. బురఖా ధరించిన ఒక మహిళ అనుమానాస్పదంగా ఇంట్లోకి ప్రవేశించడాన్ని గుర్తించింది. విచారణ నిర్వహించిన పోలీసులు అది మరెవరో కాదు.. కమలేష్ పెద్ద కుమార్తె శ్వేత(31) అని తేల్చి అరెస్టు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘కమలేష్‌ అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె శ్వేతకు పెళ్లయింది. దగ్గర్లోని ఒక ఏరియాలో ఫ్యామిలీతో నివసిస్తోంది. చిన్న కూతురుకు పెళ్లి కాలేదు. ఆమె ప్రైవేటు జాబ్ చేస్తోంది. రోజూ చిన్న కూతురు ఉద్యోగానికి వెళ్లిన తర్వాత పెద్దకూతురు శ్వేత ఇంటికి కమలేష్ వెళ్లేది. ఈక్రమంలో తల్లి కమలేష్ తన ఇంటికి వచ్చాక.. ఇంటి తాళాలను దొంగిలించి, కూరగాయలు తేవడానికి వెళ్తున్నానని చెప్పి శ్వేత బయలుదేరింది. బురఖా ధరించి వేగంగా తల్లి ఇంటికి చేరుకొని దొంగతనానికి పాల్పడింది’’ అని ఖాకీలు వివరించారు. తల్లి తన చెల్లెల్ని ఎక్కువగా ప్రేమించడాన్ని ఓర్వలేకే ఈర్ష్యతో ఈ చోరీ చేసినట్లు పోలీసు విచారణలో శ్వేత అంగీకరించింది. తన అప్పులను కట్టుకునేందుకు ఆ డబ్బులను వాడుకున్నట్లు పేర్కొంది. దొంగిలించిన ఆభరణాలలో కొన్ని తనవి కాగా, మిగిలినవన్నీ సోదరి పెళ్లి కోసం తల్లి చేయించినవని తెలిపింది.

Next Story