- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India Alliance: ఇండియా కూటమిలో రేగిన ఢిల్లీ చిచ్చు !
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ఫలితాలు వెలువడకముందే ఇండియా కూటమి(India Alliance)లో అసమ్మతి సెగ(Disaccord)లు రేగుతున్నాయి. కూటమిలో పెద్దన్న పార్టీగా చలామణి అవుతున్న కాంగ్రెస్(Congress) పట్ల కూటమి భాగస్వా్మ్య పక్షాలు(Partner Parties)భగ్గుమంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ఫలితాలు వెలువడకముందే ఇండియా కూటమి(India Alliance)లో అసమ్మతి సెగ(Disaccord)లు రేగుతున్నాయి. కూటమిలో పెద్దన్న పార్టీగా చలామణి అవుతున్న కాంగ్రెస్(Congress) పట్ల కూటమి భాగస్వా్మ్య పక్షాలు(Partner Parties)భగ్గుమంటున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు బీజేపీ విజయం సాధిస్తుందని అంచనాలు వెలువరించాయి. ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీగా ఉన్న ఆప్, కాంగ్రెస్ లు వేర్వేరుగా బీజేపీతో తలపడ్డాయి. ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కూడా ఓటమి చవిచూస్తాయని ఎగ్జిట్ పోల్ అంచనాలు స్పష్టం చేయడం ఇండియా కూటమిలో చిచ్చు రగిల్చింది.
అధికార ఆప్ ఓటమికి కాంగ్రెస్ అహంకార పూరిత వైఖరినే కారణమంటూ సమాజ్ వాదీ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ అహంకారం వల్లే కూటమికి హర్యానా, మధ్యప్రదేశ్ సహా వరుస ఓటములు ఎదురవుతున్నాయంటూ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి బీజేపీకి బీ టీమ్ లా పనిచేసిందంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంకలు బీజేపీ భాషలోనే మాట్లాడారని, ఆప్ పతనానికి ప్రయత్నించారని విమర్శించారు.
ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్నప్పటికి ఢిల్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఆప్ కు మద్దతుగా ప్రచారం చేశాయి. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న సమాజ్ వాదీ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సైతం ఢిల్లీలో కేజ్రీవాల్ వైపే నిలబడ్డాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటుగా ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఆప్ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఇక, టీఎంసీ ఎంపీ శతృఘ్నసిన్హా సైతం ఆప్‌కు మద్దతుగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం సాగించారు. 2014 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎలాగైనా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సహా దేశంలోని దాదాపు 30 పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు ముందే ఇండియా కూటమిగా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) ఏర్పడ్డాయి.
అయితే ఇండియా కూటమి ఏర్పాటుకు కృషి చేసిన బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్.. అందరికీ షాక్ ఇస్తూ ఎన్డీఏలో చేరారు. ఆ తర్వాత జేడీయూ లేకుండానే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో తలపడిన ఇండియా కూటమి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకుండా అడ్డుకోగలిగినా.. హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని ఆపడంలో మాత్రం విఫలం అయింది. మిత్రపక్షాల మద్దతుతో మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అధికారం దక్కకపోయినా.. ఇండియా కూటమి గతం కంటే భారీగానే పుంజుకుంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఘోర పరాజయం పాలైంది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ విజయం సాధించగా.. మహారాష్ట్రలోనూ ఓటమి తప్పలేదు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 56 సీట్లు పోటీ చేసి 42 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 32 సీట్లు కేటాయిస్తే ఆరు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ బలంతో కశ్మీర్ ప్రాంతంలోనే ఐదు స్థానాలను గెలిచింది. ఆయా రాష్ట్రాల ఫలితాల నేపథ్యంలో ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాయి.
ఈ క్రమంలోనే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే తృణముల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, ఆర్జేడీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూటమికి నాయకత్వం వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు దీదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవకాశం వస్తే ఇండియా కూటమిని నడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ ను కలవరపెట్టారు.
నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ కాకుండా మమతా బెనర్జీ సరైన వ్యక్తి అని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనుకున్న చోట ప్రాంతీయ పార్టీలను కలుపుకోదని..ఆ పార్టీ బలంగా లేని రాష్ర్టాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలను కలుపుకోవాలనే అహంకారం, హక్కుగా కాంగ్రెస్ భావించడం, ప్రాంతీయ పార్టీలను చిన్నచూపు చూడటమే కాంగ్రెస్ పరాజయాలకు, ఇండియా కూటమి వైఫల్యాలకు కారణమన్న విమర్శలు కాంగ్రెసేతర పక్షాలు చేస్తున్నాయి. మిత్రపక్షాలను కలుపుకుపోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్న విమర్శలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతా మళ్లీ ఊపందుకుంటున్నాయి.






