వైభవ్ గాంధీ హత్య కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్

by Naga Rani Yarlagadda |

వ్యాపారవేత్త వైభవ్ గాంధీ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వైభవ్ గాంధీ హత్య కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో సంచలనం సృష్టించిన వ్యాపారి వైభవ్ గాంధీ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు సభ్యులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఔటర్ నార్త్ ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలో ఈనెల 9న జరిగిన వ్యాపారి వైభవ్ గాంధీ (35) హత్యకు గురయ్యాడు.ఈ కేసులో పక్కా సమాచారంతో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై వారు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నిందితులను అడ్డుకునే క్రమంలో వారు పోలీసులపైకి కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. ఘటనా స్థలంలో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. ఆ తర్వాత మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులకు ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు.

అడ్డొచ్చిన వారికి ఇదే గతి పడుతుంది

ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ తయారీదారుడైన వైభవ్ గాంధీ (35) ఫిబ్రవరి 9న మధ్యాహ్న సమయంలో తన ఫ్యాక్టరీ సమీపంలో హత్యకు గురయ్యాడు. మోటార్ సైకిళ్లపై వచ్చిన నలుగురు దుండగులు వైభవ్ కారు తాళాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రతిఘటించడంతో ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను లాక్కొని, అతి సమీపం నుండి కాల్పులు జరిపారు. వైభవ్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా, దాదాపు 50 మీటర్ల మేర వెంబడించి మరీ కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ గడ్డం కింద దూసుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. హత్య జరిగిన తర్వాత వైభవ్ కారులో సుమారు రూ. 1 కోటి నగదును పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన మరుసటి రోజు.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఉన్న ఒక సోషల్ మీడియా ఖాతా ఈ హత్యకు బాధ్యత వహించింది. "గ్యాంగ్ కార్యకలాపాల్లో వైభవ్ గాంధీ జోక్యం చేసుకుంటున్నాడు. మా పనులకు అడ్డువచ్చే వారికి ఇదే గతి పడుతుంది" అని ఆ పోస్ట్‌లో హెచ్చరించారు. లారెన్స్ బిష్ణోయ్, జితేందర్ గోగి మాన్, హషీమ్ బాబా, కాలా రాణా వంటి పలు గ్యాంగ్‌ల తరపున ఈ హత్య చేసినట్లు నిందితులు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.

Next Story