- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi: ఈసీకి ఢిల్లీ హైకోర్ట్ కీలక ఆదేశాలు.. కారణమిదే?
పోటీ చేస్తున్నఅభ్యర్థులు ఎలాంటి పరువు నష్టం కలిగించే పదజాలాన్ని ఉపయోగించకుండా చూడాలని ఎన్నికల కమిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి పరువు నష్టం కలిగించే పదజాలాన్ని ఉపయోగించకుండా చూడాలని ఎన్నికల కమిషన్‌ను ఢిల్లీ హైకోర్టు (Delhi High court) ఆదేశించింది. ఓటర్లను తప్పుదారి పట్టించే, ప్రభావితం చేసే కాల్స్ వస్తున్నాయని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ప్రత్యేకించి ఒక పార్టీకి ఓటు వేయకుంటే ఓటర్లకు అందుతున్న సంక్షేమ పథకం రద్దవుతుందని వాయిస్ కాల్స్ వస్తున్నాయని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ పిల్‌పై చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల వాతావరణాన్ని కించపరిచే ధోరణితో రాజకీయ పార్టీలు, వాటి అభ్యర్థులు ప్రసారం చేస్తున్న మెసేజ్‌లు, అడ్వర్టైజింగ్ మెటీరియల్‌లను తనిఖీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారికి పూర్తి అధికారం ఉందని తెలిపింది. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడడం ఈసీ విధి అని పేర్కొంది.
ఈసీ తరఫు న్యాయవాది సిద్ధాంత్ కుమార్ (Siddanth kumar) వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల ఫిర్యాదును కమిషన్ పరిగణలోకి తీసుకుందని, ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించామని తెలిపారు. వాయిస్ కాల్‌తో సహా రాజకీయ ప్రకటనలను ధ్రువీకరించడం తప్పనిసరి అని, ఈ మేరకు ఈసీ మార్గదర్శకాలను జారీ చేసిందని చెప్పారు. ఎన్నికల ప్రధాన అధికారి నివేదిక వచ్చినప్పుడల్లా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఓటేయకపోతే ఢిల్లీలో అమలు చేస్తున్న ఉచిత పథకాలను నిలిపివేస్తామని ఓ రాజకీయ పార్టీ ఢిల్లీ ఓటర్లకు ఫోన్ ద్వారా సందేశం ఇస్తోందని ఆరోపిస్తూ ద్రోన్ దివాన్, కశిష్ ధావన్, అర్షియా జైన్ అనే ముగ్గురు న్యాయవాదులు ఈ పిల్ దాఖలు చేశారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే.






