Delhi court: పొట్టి దుస్తులు ధరించి డ్యాన్స్ చేయడం నేరం కాదు.. ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

బహిరంగ ప్రదేశాల్లో పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు స్పష్టం చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.

Delhi court: పొట్టి దుస్తులు ధరించి డ్యాన్స్ చేయడం నేరం కాదు.. ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బహిరంగ ప్రదేశాల్లో పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదని ఢిల్లీలోని తీస్ హజారీ (Tis Hazari) కోర్టు స్పష్టం చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు బార్‌లో అశ్లీల నృత్యం చేసినందుకు గాను గతేడాది అభియోగం మోపబడిన ఏడుగురు మహిళలను నిర్ధోషులుగా ప్రకటించింది. పెట్రోలింగ్‌లో భాగంగా ఢిల్లీలోని ఒక బార్‌లోకి వెళ్లిన పోలీసులు అక్కడ కొంత మంది మహిళలు పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేయడాన్ని గుర్తించారు. దీంతో ఆ మహిళలపై పహర్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు షార్ట్ డ్రెస్సెస్ వేసుకుని నృత్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిందితులు కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన న్యాయస్థానం వారిని నిర్ధోషులుగా ప్రకటించింది. ‘చిన్న బట్టలు ధరించి డ్యాన్స్ చేయడం నేరం కాదు. బహిరంగంగా చేశారా లేదా అనే దానితో సంబంధం లేదు. దాని వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే నేరంగా పరిగణించాలి’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నేరం జరిగిందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని తెలిపింది. పోలీసులు కల్పితాలు సృష్టించారని స్పష్టంగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story