- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌కు ఆ పదవి.. ఉగ్రవాదంపై యూఎన్ పోరాటంపై అనుమానాలు: రాజ్‌నాథ్ సింగ్
ఉగ్రవాదంపై యూఎన్ పోరాటంపై అనుమానాలు వస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాక్‌ను కౌంటర్ టెర్రరిజం ప్యానెల్ వైస్ చైర్ చేయడంపై మండిపడ్డారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌ను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద వ్యతిరేక కమిటీ (యూఎన్ కౌంటర్-టెర్రరిజం కమిటీ) వైస్ చైర్‌గా నియమించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘ఇస్లామాబాద్‌లో 2016లో జరిగిన సార్క్ ఇంటీరియర్ మినిస్టర్స్ సమావేశంలో ఉగ్రవాదాన్ని స్వతంత్ర పోరాటంగా చూపించడానికి పాక్ ప్రయత్నించింది. ఉగ్రవాదులు మరొకరి స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని అనుకోవడమే తప్పని అప్పుడే స్పష్టంచేశా’ అని సింగ్ తెలిపారు.
డెహ్రాడూన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. భారత్, పాక్ రెండు దేశాలకు ఒకేసారి స్వతంత్రం వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘ఇప్పుడు ప్రపంచంలో ‘ప్రజాస్వామ్యానికి తల్లి’గా భారత్ పేరు తెచ్చుకుంది. పాకిస్తాన్ మాత్రం ‘అంతర్జాతీయ ఉగ్రవాదానికి జాతిపిత’గా మారింది’’ అని ఆయన చెప్పారు. ‘9/11 టెర్రరిస్ట్ దాడుల తర్వాత యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో కౌంటర్-టెర్రరిజం ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఆ దాడి ఎవరు చేశారు? అతన్ని ఎక్కడ పట్టుకున్నాం? అని అందరికీ తెలుసు. పాక్ అతనికి ఆశ్రయం ఇచ్చింది. అలాంటి దేశాన్ని ఈ ప్యానెల్ వైస్ చైర్‌గా నియమించడం ఉగ్రవాదంపై యూఎన్ చేస్తున్న పోరాటంపై నమ్మకం కోల్పోయేలా చేస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, టెర్రరిస్టుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ అధికారులు పాల్గొంటున్నారని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ‘ఇలాంటి దేశం.. అంతర్జాతీయంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నడిపిస్తుందని ప్రపంచం ఎలా నమ్ముతుంది? ఇది ఒక భయంకరమైన జోక్ అంతే. ఈ నిర్ణయం వెనుక కారణాలు, ఈ డెసిషన్ తీసుకున్న వారి నిజాయితీపై అనుమానాలు తలెత్తుతాయి’ అని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాడేలా ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్‌పై కలిసి దౌత్య, వ్యూహాత్మక, ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.






