ఈ నెల 28న పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ

by Yella Dhawani Reddy |

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ నెల 28న పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon sessions of Parliament) సోమవారం (జులై 21) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్లమెంట్​లో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్​పై (Operation Sindoor) చర్చించనున్నారు. ఈ చర్చలు లోక్‌సభలో జులై 28న, రాజ్యసభలో జులై 29న జరుగుతాయి. రెండు సభల్లోనూ ఈ చర్చకు 16 గంటల సమయం కేటాయించారు. జులై 21న జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి అంతరాయాలు లేకపోతే, ఈ షెడ్యూల్ ప్రకారం చర్చలు జరుగుతాయి.

ఈ చర్చలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడే అవకాశం ఉంది. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ చర్చలో తప్పనిసరిగా మోడీ పాల్గొని దేశానికి సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఇక రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ అధ్యక్షతన ఈ చర్చ నిర్వహించబడుతుంది. ఎందుకంటే.. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చర్చలు కార్గిల్ విజయ దివస్‌కు (జులై 26న) రెండు రోజుల ముందు జరగనుండటం వల్ల, ప్రభుత్వం ఈ అంశాన్ని జాతీయ గర్వంతో ముడిపెట్టి, తమ బలమైన వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే, ఈ చర్చలు రాజకీయంగా ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉంది.

కాగా, పహల్గాం​ ఉగ్ర దాడిలో 26 మంది పర్యటకులు మరణించారు. దీనితో భారత్​ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, పాక్​, పీఓకేల్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి వాటిని నేలమట్టం చేసింది. తర్వాత భారత్, పాక్ మధ్య ఘర్షణలు చెలరేగాయి. చివరికి భారత్​ దెబ్బకు పాక్ తోక ముడిచి సంధికి దిగొచ్చింది. అయితే ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని భారత్ చెబుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో భారత పార్లమెంట్​లో ఆ అంశాలపై చర్చ జరిగితే అది ప్రపంచం దృష్టిని కూడా ఆకర్శించే అవకాశం ఉంది.


Next Story