డెడ్‍బాడీ కుళ్లిపోతోంది దయచేసి తీసుకెళ్లండి.. నటి ట్విషా శర్మ కుటుంబానికి పోలీసుల లేఖ

by Prasad Jukanti |   (  Updated:2026-05-20 07:40:41  IST  )

నటి, మాజీ మిస్ పూణె ట్విషా శర్మ మృతదేహాం మార్చురీలో కుళ్ళిపోతోందంటూ ఆమె తల్లిదండ్రులకు పోలీసులు లేఖ రాశారు.

డెడ్‍బాడీ కుళ్లిపోతోంది దయచేసి తీసుకెళ్లండి.. నటి ట్విషా శర్మ కుటుంబానికి పోలీసుల లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో:మాజీ మిస్ పూణె ట్వీషా శర్మ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గత వారం అత్తారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. ప్రస్తుతం ఆమె మృతదేహాం భోపాల్ ఎయిమ్స్ (AIIMS) మార్చురీలో భద్రపరిచారు. అయితే ఆ మృతదేహం కుళ్లిపోతోందని అందువల్ల వెంటనే తీసుకువెళ్లాలని తాజాగా ట్వీషా శర్మ కుటుంబ సభ్యులకు పోలీసులు లేఖ రాయడం సెన్సేషనల్‍గా మారింది. మృతదేహాం కుళ్లిపోయే స్థితి ఉన్నా ఎందుకు ఆమె కుటుంబ సభ్యులు మాత్రం మా డిమాండ్ నెరవేర్చాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు.

పెళ్లైన ఐదు నెలలకే విషాదం:

ఉత్తరప్రదేశ్ నోయిడాకు చెందిన ట్విషా శర్మ 2012లో మిస్ పూణెగా నిలించారు. సనిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ట్విషా శర్మ 2021లో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో నటించారు. ఒక డేటింగ్ యాప్ లో పరిచయమైన లాయర్ సమర్థ్ సింగ్‍ను ప్రేమించి 2025లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న ఐదు నెలల తర్వాత ఈ నెల 12న ట్వీషా శర్మ అత్తారింట్లో ఉరేసుకుని అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆత్మహత్య కంటే ముందు తన తల్లి, స్నేహితురాలికి ట్వీషా పలు సందేశాలు పంపించినట్లు తెలుస్తోంది. అమ్మా.. నన్ను బతకివ్వరు అంటూ పలు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది.

రెండోసారి పోస్ట్‌మార్టం జరిగే వరకు నో:

గత మే 13 నుండి ట్విషా శర్మ మృతదేహాన్ని భోపాల్ ఎయిమ్స్ (AIIMS) మార్చురీలో భద్రపరిచారు. అయితే మొదటి పోస్ట్‌మార్టం నివేదికపై ట్విషా కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి పోస్ట్‌మార్టం (Re-postmortem) నిర్వహించాలని పట్టుబడుతున్నారు. అప్పటి వరకు తాము మృతదేహాన్ని తీసుకువెళ్లేది లేదని మృతురాలి తండ్రి నవనిధి శర్మ స్పష్టం చేశారు. గ్రౌండ్ రిపోర్ట్‌కు, మెడికల్ రిపోర్ట్‌కు అస్సలు పొంతన లేదని, ఏదో ఒక జాతీయ స్థాయి ప్రముఖ వైద్య సంస్థ ద్వారా స్వతంత్ర విచారణ జరిపిస్తేనే నిజాలు బయటకు వస్తాయని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కానీ రోజులు గడిచే కొద్ది మార్చురీలోని ఆమె మృతదేహాం కుళ్లిపోతోందని అందువల్ల వెంటనే తీసుకువెళ్లాలని పోలీసులు కోరుతున్నారు. ఎయిమ్స్ మార్చురీలో ప్రస్తుతం మృతదేహాన్ని -4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచారు. కానీ శవం పాడవకుండా ఉండాలంటే -80 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. కానీ ఆ సదుపాయం ఇక్కడ లేదని దయచేసి మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోండి అని పోలీసులు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం రెండోసారి పోస్ట్ మార్టం చేశాకే మృతదేహాన్ని తీసుకువెళ్తామని స్పష్టం చేస్తున్నారు.

Next Story