- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుల వివక్షతోనే దళిత ఐపీఎస్ ఆత్మహత్య.. సీబీఐతో దర్యాప్తు జరపాల్సిందే.. మాయావతి డిమాండ్
హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ (Puran Kumar) ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి (BSP National President Mayawati) ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భార్య అమ్నీత్ కుమార్ హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి కూడా కావడం ఈ ఘటనను మరింత విషాదంగా మార్చిందని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలపై కుల వివక్ష, వేధింపులు ఇప్పటికీ తీవ్రంగా కొనసాగుతున్నాయనే దానికి ఈ సంఘటన మరోసారి రుజువు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలతో దేశవ్యాప్తంగా దళితుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదన, నిరాశ నెలకొందని చెప్పారు. పాలనా వ్యవస్థలో కులతత్వం ఎంత లోతుగా వేర్లునుకుందో, అధిపత్య పాలకులు, ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఇలాంటి ఘటనలు అరికట్టడంలో ఏ విధంగా విఫలమవుతున్నాయో ఇది రుజువు చేస్తోందని ఆమె వివరించారు. ఈ సంఘటనపై సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే కుల వివక్ష పై ఆరోపణలు బయటపడుతుండటం దర్యాప్తును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరపాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఈ ఘటనను సామాజిక న్యాయం కోణంలో, అత్యంత సీరియస్‌గా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసే ఆధిపత్య వర్గాలు ఈ సంఘటన నుండి పాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు విద్య, ఉద్యోగ పరంగా, ఆర్థికంగా ఎంత ఎత్తుకు ఎదిగినా, రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టినా కులం వారిని నిరంతరం వెంటాడుతుందని, కుల పేరుతో దౌర్జన్యాలు, అణచివేతలు ఈ వర్గాలపై అన్ని స్థాయిలలో కొనసాగుతూనే ఉన్నాయనడానికి ఈ ఘటనతో రుజువైందని ఆమె స్పష్టం చేశారు.






