దిత్వా తుఫాను బీభత్సం.. 334కు పెరిగిన మృతుల సంఖ్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-01 02:05:36  IST  )

దిత్వా తుఫాను శ్రీలంక (Srilanka)ను అతలాకుతలం చేస్తోంది.

దిత్వా తుఫాను బీభత్సం.. 334కు పెరిగిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: దిత్వా తుఫాను శ్రీలంక (Srilanka)ను అతలాకుతలం చేస్తోంది. ఉష్ణమండల తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు, వరదలు, మరోసారి కొండచరియలు నేలకూలడంతో మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం 334కి చేరింది. నిన్నటితో పోల్చితే ఒక్క రోజులోనే మరణాల సంఖ్య మరో 180కి చేరింది. సుమారు 400 మంది వరదల్లో గల్లంతయ్యారు. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో తీవ్ర వరదలు రావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలు ఆగిపోయినా వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. శ్రీలంక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (Sri Lanka Disaster Management Agency) సమాచారం ప్రకారం, రక్షణ బృందాలు ఇప్పటికీ ప్రమాద ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే వరద నీరు, కొండచరియలు నేలకూలిన ప్రాంతాల్లో రాకపోకలు కష్టతరంగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగుతోంది.

ఈ క్రమంలో మిత్రదేశం శ్రీలంకకు భారత్ (India) సాయం చేసేందుకు ‘ఆపరేషన్ సాగర్ బంధు’ (Operation Sagar Bandhu)తో ముందుకొచ్చింది. ముందుగా రిలీఫ్ మెటీరియల్‌ను భారత నావికాదళం యొక్క విమానవాహక నౌక INS విక్రాంత్, ముందులైన్ షిప్ INS ఉదయగిరి ద్వారా శ్రీలంక అధికారులకు అందజేశారు. ఇప్పటికే మన NDRF బృందాలు శ్రీలంక చేరుకుని సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడంలో, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీరు, వైద్య సహాయం అందించడానికి స్థానిక అధికారులు, అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. దిత్వా తుఫానుతో 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కొలంబో, తూర్పు ప్రాంతాల్లో తీవ్ర వరదల కారణంగా విద్యుత్, నీటి సరఫరా ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో శ్రీలంక ప్రభుత్వం అక్కడ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించింది.

Next Story