దేశ భద్రతకు.. 'సైబర్'తో పొంచి ఉన్న ముప్పు ..!

by Geesa Chandu |

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అమాయకులకు సైబర్ నేరగాళ్లు వల విసురుతూనే ఉన్నారు.

దేశ భద్రతకు.. సైబర్తో పొంచి ఉన్న ముప్పు ..!
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అమాయకులకు సైబర్ నేరగాళ్లు వల విసురుతూనే ఉన్నారు. వారివారి ఖాతాల నుండి డబ్బులను దొంగిలిస్తూనే ఉన్నారు. గడిచిన ఐదేండ్లలో 44,599 సైబర్ మోసాల సంఘటనలు వెలుగులోకి వచ్చాయని అధికారిక సమాచారం. దీంతో సుమారు రూ.2,137 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసుల గణాంకాలు తెలుపుతున్నాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. 29 వేలకు మించిన సైబర్ క్రైమ్స్ జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే 1,457 కోట్ల రూపాయలు నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. అయితే 2019-20 నుంచి 2023-24 ఆర్ధిక సంవత్సరం వరకు 2,137 కోట్ల రూపాయలు చేతులు మారాయి. దీంట్లో మొత్తం రికవరీ అయ్యింది రూ. 184 కోట్ల రూపాయలు మాత్రమే. ఎక్కువగా ఇలాంటి మోసాలు చెయ్యడానికి క్రెడిట్, డెబిట్ కార్డులు వాడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

దీంతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా నేరగాళ్లు ప్రజలను అతి సులభంగా మోసగిస్తున్నట్లు తెలిసింది. అయితే సైబర్ నేరాలు ఎక్కువ శాతం కర్ణాటక, తమిళనాడు, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్భులు డిమాండ్ చేస్తున్నారు. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే బ్యాంక్ అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. కొరియర్ పార్సిల్ లో కూడా డ్రగ్స్ ప్యాకెట్స్ వచ్చాయని చెప్పి వారిని బెదిరించి సొమ్ము గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రోజుకో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ సైబర్ నేరగాళ్లు ప్రజల సొమ్మును దోచేసుకుంటున్నారు.

సైబర్ నేరాలతో.. దేశాభివృద్దికి ముప్పు:

సైబర్ నేరాలు దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తాయి. ఒకరకంగా అభివృద్ధిని శాసిస్తాయి. ప్రగతిని దెబ్బతీస్తాయి. సైబర్ నేరగాళ్ల కారణంగా ఆర్ధికంగా నష్టపోయినవారికి న్యాయ సహాయం అందించవలసిన అవసరం, వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని.. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు సునాయాసంగా డబ్బు సంపాదించడానికి సాంకేతిక నిష్ణాతులుగా మారి దేశ భద్రతకు సవాళ్లు విసురుతున్నారని, అయితే నేరగాళ్ల ను ఎదుర్కోవడానికి ప్రయత్నాలను వేగవంతం చేయాలని జగదీప్ తెలిపారు. ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల నేరాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలని, మొబైల్ ఫోన్ లో వచ్చే అపరిచిత లింకులతో కూడా జాగ్రత్తగా ఉండాలని, లేనిచో నేరగాళ్లు సొమ్మును సులభంగా వారి ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారని పోలీసులు వెల్లడించారు.

Next Story