- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో: ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతిని దారుణంగా హత్య చేసి, శరీర భాగాలను ముక్కలుగా నరికి ఇనుప పెట్టె, సంచిలో కుక్కిన ఉదంతం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని ఛప్రా నుంచి గోరఖ్‌పూర్ మీదుగా లక్నో (గోమతి నగర్) వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్-1 (S1) స్లీపర్ కోచ్‌లో ఈ మృతదేహపు భాగాలు లభ్యమయ్యాయి. రైల్వే సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఎవరూ క్లెయిమ్ చేయని ఓ ఇనుప పెట్టె, సంచి కనిపించాయి. వెంటనే వారు స్టేషన్ మాస్టర్‌ను అప్రమత్తం చేయగా, ఆయన ద్వారా జీఆర్‌పీ (GRP), ఆర్పీఎఫ్ (RPF) అధికారులకు సమాచారం అందింది.
యువతి తల లేని మొండెం గుర్తింపు..
లక్నో కమిషనరేట్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం సమక్షంలో వాటిని తెరచి చూడగా ఘోరం బయటపడింది. ఇనుప పెట్టెలోని కవర్‌లో యువతి తల లేని మొండెం ఉండగా, వేరొక సంచిలో చేతులు, కాళ్లు విడివిడిగా ప్యాక్ చేసి ఉన్నాయి. మృతురాలి వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం..
లక్నో రైల్వే ఎస్పీ రోహిత్ మిశ్రా ఈ ఘటనపై మాట్లాడుతూ.. మృతదేహానికి తల లేకపోవడం వల్ల బాధితురాలి గుర్తింపు ప్రక్రియ సవాలుగా మారిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు (FIR) నమోదు చేశామని ఆయన తెలిపారు. మృతురాలిని గుర్తించడంతో పాటు, రైలు ప్రయాణించిన మార్గంలోని స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. బహుళ రాష్ట్రాలకు సంబంధించిన ఈ కేసులో రైల్వే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.






