Covid Cases: ఆసియాలో పెరిగిన కరోనా కేసులు

by Shamantha N |

ఆసియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేవ్ మొదలైన సూచనలు కన్పిస్తున్నాయి. హాంకాంగ్, సింగపూర్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

Covid Cases: ఆసియాలో పెరిగిన కరోనా కేసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆసియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేవ్ మొదలైన సూచనలు కన్పిస్తున్నాయి. హాంకాంగ్, సింగపూర్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. హాంకాంగ్‌లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని స్థానిక అధికారులు హెచ్చరించారు. ఇటీవల తీసుకున్న శాంపిల్స్ లో అనేక కేసులు పాజిటివ్ గా తేలాయన్నారు. ఈ ఏడాది ఈ స్థాయిలో కోవిడ్ పాజిటివ్స్ రావడం ఇదే తొలిసారని అన్నారు. ఒక్క వారంలో 31 కొవిడ్ మరణాలు నమోదు అయ్యాయని, ఈ ఏడాది ఇదే గరిష్ఠ సంఖ్య అని కూడా తెలిపారు. రెండేళ్ల నాటి కొవిడ్ ఇన్ఫెక్షన్ దశతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పరీక్షల్లో వైరల్ లోడ్ పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని భావించాలని అన్నారు.

సింగపూర్ లోనూ పెరిగిన కేసులు

మరోవైపు, సింగపూర్‌లో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు ఏడాది తర్వాత అక్కడి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఒక్కవారంలోనే 14,200 కేసులు నమోదయ్యాయని అన్నారు. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 28 శాతం ఎక్కువని అధికారులు అన్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా 30 శాతం పెరిగిందని చెప్పారు. జనాభాలో తగ్గుతున్న ఇమ్యూనిటీ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుత వేరియంట్ల వ్యాప్తి సామర్థ్యం గతంలో కంటే ఎక్కువగా లేదని కూడా చెబుతున్నారు. సింగపూర్, హాంకాంగ్‌తో పాటు ఆసియాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కొవిడ్ కేసులు పెరుగదల కనిపిస్తోంది. దీంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ప్రజలందరూ వ్యాక్సిన్లను వేసుకోవాలని, కొవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్న వారు బూస్టర్ డోసులు తీసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా శ్వాసకోస సంబంధిత సమస్య తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉంటే కొవిడ్ మాత్రం ఎండాకాలంలో కూడా కనిపిస్తుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Next Story