Delhi Riots: ఢిల్లీ అల్లర్ల కేసులో ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు ఆదేశాలు

by S Gopi |

తదుపరి విచారణ ఏప్రిల్ 16కి వాయిదా వేసిన అనంతరం, ఈలోగా రిపోర్టు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.

Delhi Riots: ఢిల్లీ అల్లర్ల కేసులో ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానీ ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లకు సంబంధించి ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ప్రమేయంపై దర్యాప్తు చేసేందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మంగళవారం కోర్టు ఆదేశించింది. మిశ్రాతో పాటు ఇతరులపై విచారణకు ఆదేశిస్తూ, ప్రాథమికంగా నేరం జరిగిందని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా నిర్ధారించారు. అల్లర్లు జరిగిన సమయంలో కపిల్ మిశ్రా ఆ ప్రాంతంలోనే ఉన్నారని స్పష్టమైంది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణ అవసరమని న్యాయమూర్తి తెలిపారు. తదుపరి విచారణ ఏప్రిల్ 16కి వాయిదా వేసిన అనంతరం, ఈలోగా రిపోర్టు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. 2020, ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఈశాన్య ఢిల్లీలో జరిగిన నిరసన సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 53 మంది మరణించిన సంగతి తెలిసిందే. మరో 500 మందికి పైగా గాయపడగా, కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. కపిల్ మిశ్రాతో పాటు బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే జగదీష్ ప్రధాన్, దయాల్‌పూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో సహా మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ యమునా విహార్ నివాసి మహ్మద్ ఇలియాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈశాన్య ఢిల్లీలోని కర్దంపురిలో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే అయిన కపిల్ మిశ్రా, మరికొందరు చిరు వ్యాపారుల బండ్లను ధ్వంసం చేయడం తాను చూశానని ఇలియాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు వారి పక్కనే నిలబడి ఆందోళనకారులను ఖాళీ చేయమని హెచ్చరించారని చెప్పారు. అయితే, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మహ్మద్ ఇలియాస్ పిటిషన్‌ను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు.

Next Story