- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్య
రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణాన్ని తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీడియో నోట్, సూసైడ్ నోట్ లో దంపతులు కీలక విషయాలను పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కన్నకొడుకు రోడ్డుప్రమాదంలో చనిపోయాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఛత్తీస్ గఢ్ లోని జాంజ్ గిర్ - చంపా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన కృష్ణ పటేల్, రమాబాయి పటేల్ (47) దంపతులకు ఒక్కడే కుమారుడు. కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ కుమారుడు మరణించాడు. అప్పటి నుండి ఆ దంపతులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారు. ఫిబ్రవరి 16న తమ నివాసంలోని పెరట్లో ఉన్న చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఇద్దరూ ప్రాణాలు విడిచారు.
సోమవారం (ఫిబ్రవరి 16) ఉదయం నుండి పటేల్ దంపతుల ఇంటి ప్రధాన ద్వారం లోపలి నుండి గడియ పెట్టి ఉండటం, ఇంట్లో ఎటువంటి కదలికలు లేకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చింది. వారు ఎంత పిలిచినా లోపలి నుండి స్పందన లేకపోవడంతో కిటికీలోంచి చూడగా, పెరట్లో దంపతులిద్దరూ ఉరివేసుకుని కనిపించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తనిఖీల్లో పోలీసులకు ఒక వీడియో మెసేజ్, నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభించాయి. తమకు రావాల్సిన ఇన్సూరెన్స్ (బీమా) సొమ్మును తన అన్నకు అందజేయాలని కృష్ణ పటేల్ ఆ వీడియోలో కోరారు. కుమారుడు లేని జీవితం తమకు భారంగా మారిందని, ఆ బాధను భరించలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. "కష్టకాలంలో వారికి సరైన మానసిక ధైర్యం అంది ఉంటే, ఇంతటి దారుణ నిర్ణయం తీసుకునేవారు కాదు" అని గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.






