రాహుల్, ప్రియాంక, ఖర్గేలపై వివాదాస్పద పోస్టర్లు.. కేసు నమోదు చేసిన పోలీసులు

by Kema Shiva Kumar |

కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ అగ్రనేతలపై వెలసిన వివాదాస్పద పోస్టర్లు కలకలం రేపిన విషయం తెలిసిందే.

రాహుల్, ప్రియాంక, ఖర్గేలపై వివాదాస్పద పోస్టర్లు.. కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే టార్గెట్‌గా కేరళలోని వాయనాడ్‌ (Wayanad)లో వెలసిన వివాదాస్పద పోస్టర్లు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. మే 13న వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) కార్యాలయ కాంపౌండ్ గోడతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈ వివాదాస్పద పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. కేరళ సీఎం ఎంపికపై తీవ్ర ఉత్కంఠ, అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలోనే ఈ పోస్టర్లు రావడం గమనార్హం. వాయనాడ్ ప్రస్తుత ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాను టార్గెట్ చేస్తూ, వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడ ఓడిపోవడం ఖాయమని.. వాయనాడ్ తదుపరి అమేథీగా మారుతుందని ఆ పోస్టర్లలో హెచ్చరించారు. గతంలో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

రంగంలోకి దిగిన పోలీసులు..

అయితే, వివాదాస్పద పోస్టర్లను గమనించిన కాంగ్రెస్ శ్రేణులు వాటిని గోడలపై నుంచి తొలగించారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.సిద్ధిఖీ (T.Siddiqui) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కల్పెట్ట పోలీసులు రంగంలోకి దిగి పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న వారు డీసీసీ కార్యాలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఈ పోస్టర్లను గోడలపై అంటిస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఆ విజువల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Next Story