Congress: వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌..!

by Shamantha N |

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టుని ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్‌ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధతను సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామని ప్రకటించింది.

Congress: వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌..!
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టుని ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్‌ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధతను సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామని ప్రకటించింది. 13 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ తర్వాత వివాదాస్పద చట్టానికి రాజ్యసభలో ఆమోదం లభించింది. ఆ తర్వాత శుక్రవారం తెల్లవారుజామున పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుపై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చెప్పుకొచ్చారు. రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. గతంలో సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై పోరాటాలు చేశామని గుర్తుచేశారు.

విపక్షాల విమర్శలు

రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సమయంలో ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వక్ఫ్ బిల్లును "ముస్లిం వ్యతిరేకం", "రాజ్యాంగ విరుద్ధం" అని అభివర్ణించారు. మరోవైపు, ఇదో "చారిత్రక సంస్కరణ" అని మైనారిటీ సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుందని అధికారపార్టీ ఎంపీలు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొచ్చారు. రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేయడంతో ఆమోదం లభించింది. గురువారం తెల్లవారుజామున లోక్‌సభలో 288 మంది సభ్యులు మద్దతుగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.

Next Story