- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నేత హత్య కేసు.. 20 ఏళ్ల తర్వాత అందరూ నిర్దోషులే
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్ హత్య కేసులో (2006) తుది తీర్పు వెలువడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్ హత్య కేసులో (2006) తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి పద్మసింహ పాటిల్ సహా ఎనిమిది మందిని ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. హత్యకు సంబంధించిన కుట్ర కోణాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సత్యనారాయణ నవందర్ స్పష్టం చేశారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు పరాస్మల్ జైన్ వాంగ్మూలం అనుమానాస్పదంగా ఉందని, సంఘటనల క్రమాన్ని అది సరిగ్గా నిర్ధారించడం లేదని పేర్కొంటూ కోర్టు దాన్ని తోసిపుచ్చింది.
అసలేం జరిగిందంటే..?
2006 జూన్ 3న ముంబై నుంచి ఉస్మానాబాద్ (ప్రస్తుత ధారాశివ్) వెళ్తున్న నింబాల్కర్‌తో పాటు ఆయన డ్రైవర్ సమద్ ఖాజీని నవీ ముంబైలోని కలంబోలి వద్ద దుండగులు అడ్డగించి కాల్చి చంపారు. మొదట నవీ ముంబై పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసును, నింబాల్కర్ భార్య అసంతృప్తి వ్యక్తం చేయడంతో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి బదిలీ చేశారు. దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. 2009 జూన్‌లో పద్మసింహ పాటిల్‌ను అరెస్టు చేసింది. అయితే అదే ఏడాది సెప్టెంబర్‌లో రాయగఢ్ జిల్లా అలీబాగ్ సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సుమారు రెండు దశాబ్దాల విచారణ అనంతరం నేరం రుజువు కాకపోవడంతో తాజాగా న్యాయస్థానం నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చింది. న్యాయస్థానం 20 ఏళ్ల విచారణలో 128 మంది సాక్షులను విచారించింది.
నిర్దోషిగా విడుదలైన ఎన్సీపీ మాజీ ఎంపీ పద్మసింహ పాటిల్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్‌కు సోదరుడు కావడం గమనార్హం. అలాగే, హత్యకు గురైన నింబాల్కర్ కుమారుడు ఓంప్రకాశ్ రాజే నింబాల్కర్ ప్రస్తుతం శివసేన (యూబీటీ) తరపున లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.






