- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్-ఈయూ ట్రేడ్ డీల్ ఖరారు.. చర్చలు ముగిశాయని భారత్ ప్రకటన
భారత్-ఈయూ ట్రేడ్ డీల్ ఖరారైంది. దీనిపై చర్చలు ముగిశాయని వాణిజ్య సెక్రెటరీ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: రెండు దశాబ్దాల చర్చల తర్వాత భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య చర్చలు ముగింపునకు వచ్చాయి. దీంతో పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని వాణిజ్య శాఖ సెక్రెటరీ రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. 2007లో ఈ డీల్ కోసం మొదలైన చర్చలు సోమవారం ముగియడం గమనార్హం. ‘ట్రేడ్ డీల్ చర్చలు విజయవంతంగా ముగిశాయి. డీల్ ఫైనలైజ్ అయింది’ అని ఆయన ప్రకటించారు. సమతుల్యంగా ఉన్న ఈ డీల్‌తో భారత్‌కు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని, యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థతో మరింత సన్నిహితమైన సంబంధాలు ఏర్పడతాయని వివరించారు. ప్రస్తుతం ఈ డీల్‌కు సంబంధించిన పత్రాలు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. ఫార్మాలిటీలన్నీ పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా ఒప్పందంపై సంతకాలు చేస్తామని అగర్వాల్ పేర్కొన్నారు.
ఈ ఏడాదిలోనే డీల్‌పై సంతకాలు జరుగుతాయని, వచ్చే ఏడాది ఆరంభం నుంచి డీల్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. భారత్‌లో డీల్‌కు యూనియన్ కేబినెట్ ఆమోదం లభిస్తే సరిపోతుంది. కానీ ఈయూ వైపు సంతకాలు పూర్తవడానికి యూరోపియన్ పార్లమెంటులో దీనిపై చర్చలు జరగాల్సి ఉంటుంది. దీని వల్ల డీల్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. మంగళవారం నాడు భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా డీల్ నెగోషియేషన్స్ ముగిసినట్లు ఇరువర్గాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు భారత్ చేసుకున్న ఒప్పందాలన్నింటికీ తలదన్నే స్థాయిలో ఈ ఒప్పందం ఉంటుందని, అందుకే దీన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ అని పిలుస్తున్నామని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇది ఎన్డీయే ప్రభుత్వం పూర్తిచేసిన 8వ ట్రేడ్ డీల్ కావడం గమనార్హం. ఇప్పటికే ఆస్ట్రేలియా, యూకే, ఒమన్, న్యూజిల్యాండ్, యూఏఈ, ఈఎఫ్‌టీఏ బ్లాక్, మారిషస్‌తో భారత్ కీలకమైన ట్రేడ్ డీల్స్ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే.
సుంకాల్లో కోత..
ఈ డీల్‌తో భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులకు యూరోపియన్ మార్కెట్లలో డ్యూటీ ఫ్రీ లేదా ప్రాధాన్యతగా యాక్సెస్ లభిస్తుంది. ప్రస్తుతం భారతీయ ఉత్పత్తులపై ఈయూ సగటున 3.8 శాతం సుంకాలు వేస్తోంది. అయితే లేబర్ ఇంటెన్సివ్ ఉత్పత్తులైన టెక్స్‌టైల్స్, కెమికల్స్, జెమ్స్, ఆభరణాలు, ఎలక్ట్రికల్ మెషీన్లు, లెదర్, ఫుట్‌వేర్ తదితరాలపై సుమారు 10 సుంకాలు వేస్తున్నారు. అదే సమయంలో యూరోపియన్ వస్తువులపై భారత్ సగటున 9.3 శాతం సుంకాలు వేస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్స్, విడిభాగాలపై 35.5 శాతం వరకు సుంకాలు వేస్తుండగా.. ప్లాస్టిక్స్‌పై 10.4 శాతం, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్‌పై 9.9 శాతం టారిఫ్‌లు వేస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో ఈ సుంకాలను పూర్తిగా తొలగించడమో లేదంటే 90 శాతం వరకు తగ్గించడమో జరుగుతుందని నిపుణులు తెలిపారు. అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు సుంకాలతో బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో ఈ డీల్.. ఇరుపక్షాలకు కీలకంగా మారింది.






